
- డెడ్‌బాడీతో బంధువుల ఆందోళన
- ఇంటి కిటికీలు, కారు అద్దాలు ధ్వంసం
ఇల్లెందు/కారేపల్లి, వెలుగు: సివిల్ కాంట్రాక్టర్ గడపర్తి శ్రీనివాసరావు(55) శుక్రవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మొట్లగూడెంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతికి ఇల్లెందు మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కారణమని ఆరోపిస్తూ బంధువులు డెడ్ బాడీతో ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మృతుడు గడపర్తి శ్రీనివాసరావు మధ్య ఆరేళ్లుగా ఆర్ధికలావాదేవీలు నడుస్తున్నాయి. గత ఏడాది నుంచి రూ.1.5 కోట్ల లావాదేవీల విషయంలో ఇద్దరి మద్య మనస్పర్ధలు వచ్చాయి. శుక్రవారం ఇదే విషయమై ఖమ్మంలోని కమ్మ సత్రంలో పంచాయితీ నిర్వహించారు. ఆ తరువాత శ్రీనివాసరావు తన పొలంలో కారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు డెడ్‌బాడీని అదే కారులో ఇల్లెందులోని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటికి తీసుకువచ్చి ఆందోళనకు దిగారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆగ్రహించిన బంధువులు కారు, ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఇల్లెందు డీఎస్పీ ఎన్.చంద్రభాను, సీఐ తాటిపాముల సురేశ్ వారికి సర్ది చెప్పి శ్రీనివాస్ డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య రమ ఫిర్యాదు మేరకు కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.