
టోర్నీ ఏదైనా, ఆతిథ్యం ఎక్కడైనా విరాట్ కోహ్లికి బ్యాటుతో బాదడమే తెలుసు. మూడో నెంబర్ బ్యాటర్ గా వచ్చి జట్టుకు కీలక విజయాలందిస్తాడు. విరాట్ క్రీజులో ఉన్నాడంటే టీమిండియా విజయం కాయం అయినట్టే... విరాట్ కి మద్దతుగా ఇలాంటి పొగడ్తలు చాలానే వింటుంటాం. అయితే, కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన విరాట్, తిరిగి ఆసియా కప్ లో పుంజుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లోనూ కీలకమైని ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేల్లో, టెస్ట్ ల్లో ఘోరంగా విఫలమై మళ్లీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీ20లకు దూరంగా ఉండాలని.. వన్డే, టెస్ట్ కెరీర్ కొనసాగించాలని సూచిస్తున్నారు. ఈ విమర్శలన్నింటిని తిప్పి కొడుతూ విరాట్ కి మద్దతుగా నిలిచాడు భారత మాజీ బ్యాటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.
రాబోయే వన్డే వరల్డ్ కప్ కి విరాట్ స్థానంలో కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని వచ్చిన మాటలకు శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘విరాట్ ప్రపంచ ఉత్తమ బ్యాట్స్ మెన్. వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లకు అతను టీంలో ఉండటం ఎంతో ఉత్తమం. విరాట్ టీం వాతావరణం మార్చగలడు. ప్లేయర్లలో స్పిరిట్ ను నింపగలడు. మూడో నెంబర్ బ్యాట్స్ మెన్ గా ఈ వరల్డ్ కప్ లో తనదైన మార్క్ వేస్తాడు. అలాంటి వాడిని కొన్ని ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయ్యే సరికి తప్పుబట్టడం సరికాదు’ అన్నాడు.
అక్టోబర్ లో ప్రారంభం కాబోయే వన్డే వరల్డ్ కప్ కి టీమిండియా ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. వరల్డ్ కప్ కోసం భారత్ మొత్తం 35 వన్డే మ్యాచ్ లు ఆడనుంది. అయితే. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న టాప్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి శ్రీలంకతో జరిగే వన్డే సిరిస్ తో బరిలోకి దిగుతారు.