
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కేఎస్ రాణా మంగళవారం నిర్ధారించారు. కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో సత్యపాల్ మాలిక్ బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 1.10 PM సమయంలో ఆయన చనిపోయినట్లు పేర్కొన్నారు. మే 11న సత్యపాల్ మాలిక్ హాస్పిటల్లో చేరారు. ఆయనకు చికిత్సలో భాగంగా డయాలసిస్ చేశారు. జూన్ 8న సత్యపాల్ మాలిక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలొచ్చాయి. తన ఆరోగ్య పరిస్థితిపై సత్యపాల్ మాలిక్ ‘ఎక్స్’ ఖాతాలో హెల్త్ అప్డేట్ అదే సమయానికి రావడం గమనార్హం.
గత నెల రోజులుగా తాను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నానని, కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆ పోస్ట్లో ఆయన తెలిపారు. సత్యపాల్ మాలిక్ 2018 ఆగస్ట్ నుంచి 2019 అక్టోబర్ వరకూ జమ్ము కశ్మీర్ గవర్నర్గా సేవలందించారు. ఆర్టికల్ 370 రద్దు కూడా ఆయన గవర్నర్గా ఉన్న సమయంలోనే జరిగింది. ఆ చారిత్రాత్మక నిర్ణయానికి ఆరేళ్లు పూర్తి కావడం గమనార్హం. మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, ఒక సారి కేంద్ర మంత్రిగా సత్యపాల్ మాలిక్ సేవలందించారు. గోవా, మేఘాలయ, బీహార్ కు కూడా ఆయన గవర్నర్ గా పనిచేశారు. 1960వ సంవత్సరంలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. స్టూడెంట్ లీడర్ గా తన పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ 1974లో బాఘ్ పట్ స్థానానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.