మాజీ ఎంపీ పొంగులేటికి రాష్ట్ర సర్కారు షాక్

మాజీ ఎంపీ పొంగులేటికి రాష్ట్ర సర్కారు షాక్

 

  •     సెక్యూరిటీ తగ్గింపు, ఎస్కార్ట్ వెహికల్ తొలగింపు
  •     ఇటీవల ఆత్మీయ సమ్మేళనంలో చేసిన కామెంట్లే కారణం?
  •     పార్టీ మారతారనే అంచనాలతోనే అంటున్న అనుచరులు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డికి రాష్ట్ర సర్కారు షాకిచ్చింది. ఆయనకు ఇన్ని రోజుల నుంచి ఉన్న సెక్యూరిటీని తగ్గించింది. త్రీ ప్లస్​ త్రీ గా ఉన్న గన్​ మెన్​ లను టూ ప్లస్​ టూకి తగ్గించింది. ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించింది. ఇంటి దగ్గర భద్రతగా ఉండే ఐదుగురు సిబ్బందిని పూర్తిగా వాపస్ తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకలపుడు ఖమ్మంలోని తన ఇంట్లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో సొంత​పార్టీపై పొంగులేటి చేసిన కామెంట్లకు రియాక్షన్​గానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. నాలుగేండ్లలో బీఆర్ఎస్ లో జరిగిన గౌరవమేంటో అందరికీ తెలుసంటూ ఆయన చేసిన కామెంట్.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో తన టీమ్​ సభ్యులందరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రకటించడం కూడా హైకమాండ్​కు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. దీని ఫలితంగానే మొదట సెక్యూరిటీని తగ్గించి ఒక వార్నింగ్ లాంటి ఇండికేషన్​ పంపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ మార్పు ఖాయమా? 

సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి గత పార్లమెంట్ ఎన్నికలపుడు ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో.. అప్పటి నుంచి ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలవడంతో పాటు, ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్సార్​ఎల్పీని టీఆర్ఎస్​(ప్రస్తుత బీఆర్​ఎస్​)లో విలీనం చేసి, పొంగులేటి కూడా టీఆర్ఎస్​లో చేరారు. అయినా.. 2018 ఎన్నికల్లో ఎంపీ సీటును పొంగులేటికి కాకుండా టీఆర్ఎస్ నామా నాగేశ్వరరావుకు కేటాయించింది. ఆ తర్వాత రాజ్యసభ సీటు ఇస్తారని, ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగినా ఇవ్వలేదు. దీంతో చాలా సార్లు పొంగులేటి పార్టీ మారుతున్నారంటూ, ఫలానా పార్టీలోకి వెళ్తున్నారంటూ రూమర్లు వచ్చాయి. వాటిని గతేడాది వరకు పొంగులేటి ఖండిస్తూ వచ్చారు. కానీ, ఈమధ్య ఆయనే పార్టీ మారాలని డిసైడ్ అయ్యారని ఆయన అనుచరులు చెప్తున్నారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయ భవిష్యత్​ ఉండదనే అంచనాకు వచ్చాకే  పొంగులేటి పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఆయన కామెంట్లు చేశారని చెప్తున్నారు. తన అనుచరులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించడం ద్వారా పార్టీ మార్పు ఆలోచనను బయటపెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.