జగదీశ్ రెడ్డిపై విచారణ జరపాలి : దామోదర్ రెడ్డి

జగదీశ్ రెడ్డిపై విచారణ జరపాలి : దామోదర్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు:విద్యుత్ శాఖలో రూ.85 వేల కోట్ల అప్పుల విషయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.   ఆదివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. జగదీశ్ రెడ్డి మంత్రిగా అక్రమంగా సంపాదించిన డబ్బులను ఎన్నికల్లో ఖర్చుచేసి గెలిచారని విమర్శించారు. నైతిక విజయం తనదేనని చెప్పారు.  విద్యుత్ శాఖలో అప్పులకు  పదేండ్లు మంత్రిగా పనిచేసిన జగదీశ్‌‌ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌ పాలనలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, అందుకే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ముఖ్యమైన ఫైల్స్ మాయం చేస్తున్నారని  మండిపడ్డారు. కొందరు బీఆర్‌‌‌‌ఎస్‌‌ నాయకులు రియల్ ఎస్టేట్ పేరుతో సూర్యాపేటలో ప్రభుత్వ భూములు, నాలాలు ఆక్రమించారని మండిపడ్డారు.  సూర్యాపేట మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో జగదీశ్ రెడ్డి బంధువులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

వీరిపై ప్రభుత్వాన్ని విచారణ కోరుతానన్నారు.  తాను గెలవకపోయినా నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తాని చెప్పారు. సూర్యాపేట పట్టణం , నియోజకవర్గం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి  ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీతో తో పాటు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు  కృషి చేస్తామన్నారు. మెయిన్ రోడ్  బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని,  ఐటి హబ్ ఏర్పాటు చేసి యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.