వరంగల్, వెలుగు: రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్లలో రైతులను ఎలా మోసం చేసిందో వివరించేందుకు తాము వరంగల్‌లో రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ మంత్రులు దీనికి పోటీగా రైతుమేళా ఏర్పాటు చేశారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. మంగళవారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని సదస్సు ప్రాంగణం వద్ద మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ నేతలు ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, రైతు సంగ్రామ సదస్సు కోసం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌కు అనుమతి కోరినా ఇవ్వలేదని, తమ కార్యక్రమానికి పోటీగా మంత్రులు బ్యాండ్ మేళా నిర్వహించారని ఎద్దేవా చేశారు. నగరంలో తమ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేశారని ఆరోపించారు.
వరంగల్‌కు వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంత్రులకు దమ్ముంటే ఏనుమాముల మార్కెట్‌కు రావాలని సవాల్ విసిరారు. రైతులు పంట అమ్మడానికి వస్తే కొనుగోలు కేంద్రాలు లేవని, గన్నీ బ్యాగులు, ట్రాన్స్‌పోర్ట్ లారీలు, కాంటాలు, గోదాములు అందుబాటులో లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారా అని ప్రశ్నించారు.
రైతు డిక్లరేషన్ ఎక్కడా..?
కేసీఆర్ పాలనలో రైతులు ఎక్కడా ధర్నాలు చేసిన పరిస్థితి లేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేసిందని పేర్కొన్నారు. 2022 మే 6న రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఎక్కడ అమలైందని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ, రైతు సంగ్రామ సదస్సులో రైతులతో మాట్లాడిస్తామని, వారి సమస్యలను ప్రభుత్వం వినాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
