బీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా.. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుంది: హరీష్ రావు

బీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా.. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుంది: హరీష్ రావు

బీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. గతంలో కూడా ఐదుగురు మంత్రులు మేడిగడ్డ వెళ్లి వచ్చారన్నారు. మేడిగడ్డ సందర్శనకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లె ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మేడిగడ్డ ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు..15 రిజర్వాయర్లు 240 టీఎంసీల నీటి వినియోగం అని వివరించారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మేడిగడ్డకు వెళ్ళేటప్పుడు మల్లన్న సాగర్ రిజర్వాయర్ కు వెళ్లి చూడాలని సూచించారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ను మెచ్చుకున్నారని గుర్తు చేశారు. మేడిగడ్డ అంశంతో రాజకీయంగా లబ్ది పొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని.. కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఎస్సారెస్పీకి వచ్చాయని చెప్పారు. మేడిగడ్డలో లోపం ఎక్కడ ఉందో గుర్తించి.. పునరుద్ధరణ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలని హరీష్ రావు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫ్లై ఓవర్లు కూలిపోయాయని అన్నారు. దేవాదులలో పంపులు ఆన్ చేయగానే పైపులు పగిలిపోయాయని తెలిపారు. 

సభా సాంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఉల్లంఘిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏకపక్షంగా సభను నడుపుతున్నారని విమర్శించారు. ఎజెండాలో లేని అంశాలను అసెంబ్లీలో ప్రభుత్వం మాట్లాడుతున్నారని.. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు.