పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తేనే నిలుస్తం : హరీశ్ రావు

పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తేనే నిలుస్తం :  హరీశ్ రావు
  • ఓటమితో నీరుగారొద్దు.. గుణపాఠాలు నేర్చుకోవాలి 

హైదరాబాద్, వెలుగు :  పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తేనే నిలుస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నీరుగారొద్దని.. ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ భవన్ లో బుధవారం నిర్వహించిన ఆదిలాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. 

కాంగ్రెస్ ఇచ్చిన ఆచరణలో సాధ్యం కాని హామీలు, సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారంతోనే ఓడిపోయామన్నారు. కాంగ్రెస్ హామీలను అమలు చేసే పరిస్థితి లేదని, కొన్ని రోజుల తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదన్నారు. ప్రభుత్వం ఇప్పటికే గృహలక్ష్మీ స్కీమ్​ను రద్దు చేసిందని, దళితబంధును నిలిపే వేసే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు.

 వీటిపై అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు. కొత్త ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని, అలాంటి వారి ఆందోళనలకు మద్దతునివ్వాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేలా రానున్న రోజుల్లో ప్రజలను కలుపుకొని ఉద్యమిద్దామని లీడర్లు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.