
- ఆయన కిషన్ రెడ్డి, రాంచంద్రారావులాగా మాట్లాడడం కరెక్ట్ కాదు
కరీంనగర్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముందుండి పోరాడాలని, సంజయ్ కూడా కిషన్ రెడ్డి, రాంచందర్ రావులాగా మాట్లాడితే ఎలా అని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్ పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందంటే ఆ ఘనత రాహుల్ గాంధీదేనని కొనియాడారు. కరీంనగర్ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపాడంటేనే అందులో న్యాయం ఉందని అర్థమన్నారు.
కేంద్రం దీనిపై మూడు నెలలల్లోగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. రిజర్వేషన్ల పెంపును 9వ షెడ్యూల్ లో చేర్చకపోగా, తన అభిప్రాయాన్ని చెప్పకుండా కేంద్రం జాప్యం చేస్తోందని విమర్శించారు. ఇప్పుడు పంపిన ఆర్డినెన్స్ ను కూడా ఆమోదించకుండా మళ్లీ హోం శాఖకు గవర్నర్ పంపారని తెలిపారు. ముస్లింలకు బీసీల్లో రిజర్వేషన్ వద్దంటున్న బీజేపీ గుజరాత్, మహారాష్ట్రలో ఎందుకు కల్పిస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లను బీఆర్ఎస్ తగ్గించిందని, డెడికేటెడ్ కమిషన్ వేయకుండా బీఆర్ఎస్ మోసం చేసిందని గుర్తు చేశారు.