ఫార్ములా ఈ స్కామ్లో రూ.600 కోట్ల క్విడ్ప్రో కో.. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్కుమార్ శిక్షార్హులు

ఫార్ములా ఈ స్కామ్లో  రూ.600 కోట్ల క్విడ్ప్రో కో.. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్కుమార్ శిక్షార్హులు
  • సర్కారుకు78 పేజీలు, వెయ్యికిపైగా డాక్యుమెంట్లతో ఏసీబీ తుది నివేదిక
  • న్యాయవిచారణకు అనుమతి కోరుతూ సీఎస్, స్పీకర్‌‌‌‌కు లేఖ
  • గత సర్కార్ హయాంలో ఫార్ములా–ఈ రేస్ పేరుతో హెచ్‌‌ఎండీఏ బోర్డు నిధులు గోల్‌‌మాల్‌‌
  • కేటీఆర్ ప్రధాన నిందితుడిగా పోయినేడాది డిసెంబర్‌‌‌‌ 19న ఏసీబీ ఎఫ్‌‌ఐఆర్ 
  • మొత్తం 10 మందిపై అభియోగాలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా–ఈ రేస్‌‌ స్కామ్‌‌లో రూ.600 కోట్ల క్విడ్​ప్రో కో జరిగినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ఫార్ములా–ఈ రేస్‌‌ నాలుగు సీజన్ల కోసం ఏమాత్రం సంబంధం లేని హెచ్ఎండీఏ ద్వారా మూడేండ్ల పాటు రూ.600 కోట్లు ఖర్చు చేసేలా అగ్రిమెంట్స్ చేసుకున్నారని, ఇందుకు పలు రూపాల్లో ప్రతిఫలం పొందేలా ప్రణాళిక రచించారని తెలిపింది. ప్రభుత్వం మారడంతో వీరి వ్యూహం బెడిసి కొట్టిందని.. ఇందుకు సూత్రధారులైన మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్​ అర్వింద్ కుమార్ ​ముమ్మాటికీ శిక్షార్హులని పేర్కొంది. 

వీరిద్దరి న్యాయవిచారణకు అనుమతి కోరుతూ విజిలెన్స్​కమిషనర్, స్పీకర్, సీఎస్‌‌కు మంగళవారం లేఖలు రాసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్​ కోడ్‌‌కు విరుద్ధంగా రూ.58.89 కోట్ల హెచ్ఎండీఏ బోర్డు నిధులను దేశం దాటించడంలో కేటీఆర్​ కీలకంగా వ్యవహరించగా, ఆయన ఆదేశాలను అర్వింద్ ​కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్‌‌ ఇంజనీర్ బీఎల్ఎన్​రెడ్డి గుడ్డిగా అనుసరించారని ఏసీబీ తేల్చింది. 8 నెలల దర్యాప్తు అనంతరం మంగళవారం 78 పేజీలు, వెయ్యికి పైగా డాక్యుమెంట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్​కమిషనర్​ద్వారా ఏసీబీ తుది నివేదికను సమర్పించింది. 

పోయినేడాది డిసెంబర్​19న ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ.. ప్రధాన నిందితుడు కేటీఆర్‌‌‌‌, సీనియర్ ఐఏఎస్‌‌ అర్వింద్‌‌కుమార్‌‌‌‌, హెచ్‌‌ఎండీఏ మాజీ సీఈ‌‌ బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డి, ఆర్గనైజర్‌‌‌‌ ఏస్‌‌ నెక్స్ట్‌‌జెన్‌‌కు చెందిన కిరణ్‌‌రావు, లండన్ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌ ప్రతినిధులు సహా మొత్తం10 మందిపై అభియోగాలు మోపింది. 

రిపోర్ట్‌‌తో పాటు గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవోలు, హెచ్‌‌ఎండీఏ అకౌంట్‌‌ నుంచి లండన్ అకౌంట్లకు బదిలీ అయిన నిధులు సహా ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌కు చెల్లించిన జరిమానాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అందించింది. నిందితుల్లో కేటీఆర్​ఎమ్మెల్యే కావడంతో న్యాయవిచారణ కోసం అసెంబ్లీ స్పీకర్‌‌‌‌కు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కోర్టులో చార్జ్‌‌షీట్‌‌ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌తో రూ.600 కోట్లకు ఎసరు..?

బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్‌‌ సాగర్‌‌‌‌ వద్ద ఫార్ములా–ఈ కార్ రేస్‌‌ నిర్వహించారు. ఎలక్ట్రిక్‌‌ కార్ల రేసింగ్‌‌ కోసం బ్రిటన్‌‌కు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌‌, హైదరాబాద్‌‌కు చెందిన గ్రీన్‌‌కో సిస్టర్ కంపెనీ ఏస్‌‌ నెక్ట్స్‌‌ జెన్‌‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌‌ అండ్ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌(ఎంఏయూడీ) మధ్య 2022 అక్టోబర్‌‌25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం నాలుగు సీజన్లకు గాను మూడేండ్ల పాటు రూ.600 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా హుస్సేన్‌‌సాగర్ పరిసరాల్లో సీజన్ 9,10,11,12 కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను ఎంఏయూడీ సమకూర్చాల్సి ఉంది.

 2023 ఫిబ్రవరి 11న సీజన్‌‌ 9 నిర్వహించారు. వివిధ కారణాల వల్ల ఏస్‌‌ నెక్ట్స్‌‌ జెన్‌‌, ఫార్ములా‌‌‌‌–ఈ ఆపరేషన్స్‌‌ మధ్య విభేదాలు తలెత్తాయి. ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌‌కు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో ఆ సంస్థ  కార్ రేస్‌‌ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందించింది. దీంతో అప్పటి మున్సిపల్‌‌ శాఖ మంత్రి కేటీఆర్​ఆదేశాలతో ఐఏఎస్​అర్వింద్‌‌కుమార్‌‌‌‌.. ఫార్ము లా–ఈ ఆపరేషన్స్‌‌, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్‌‌ 30న  కొత్తగా మరో ఒప్పందం చేసుకున్నారు. ఈవెంట్‌‌ నిర్వహణ కోసం స్పాన్సర్‌‌‌‌ ఫీజు, ట్యాక్స్‌‌లు కలిపి మొత్తం రూ.110  కోట్లు చెల్లించే విధంగా అగ్రిమెంట్‌‌లో పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్‌‌, సివిల్‌‌ వర్క్స్ కోసం మరో రూ.50  కోట్లు ఖర్చు చేసే విధంగా అండర్‌‌‌‌ టేకింగ్‌‌ తీసుకున్నారు. 

ఏమాత్రం సంబంధం లేని హెచ్‌‌ఎండీఏ బోర్డు ద్వారా మొత్తం రూ.160 కోట్లు చెల్లించాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే అసెంబ్లీ ఎలక్షన్స్‌‌ మోడల్ కోడ్‌‌ ఆఫ్‌‌ కండక్ట్‌‌ అమల్లో ఉన్నది. వీటికి సంబంధించి ఈసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కోడ్‌‌ అమల్లో ఉన్నప్పటికీ..సీజన్‌‌ 10 నిర్వహణకు సంబంధించి 2023 అక్టోబర్‌‌‌‌3,11వ తేదీల్లో హెచ్‌‌ఎండీఏ బోర్డు సాధారణ నిధుల నుంచి ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌‌కు రూ.45 కోట్ల71 లక్షల 60 వేల 625 విదేశీ కరెన్సీలో ట్రాన్స్‌‌ఫర్‌‌ ‌‌చేశారు.

 ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఫారిన్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌ జరగడంతో ఐటీ శాఖ హెచ్‌‌ఎండీఏకు రూ.8.07 కోట్లు జరిమానా విధించింది. ఈ మొత్తం వ్యవహారంలో హెచ్‌‌ఎండీఏ బోర్డు ఖజానా నుంచి మొత్తం రూ.54  కోట్ల 88 లక్షల 87 వేల 43 దుర్వినియోగమయ్యాయి. అప్పటికే కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ వ్యవహారం రూ.54.88 కోట్లకే ఆగిపోయిందని, లేదంటే రూ.600 కోట్ల స్కామ్​జరిగి ఉండేదని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఎలక్టోరల్ బాండ్స్‌‌ ద్వారా బీఆర్‌‌‌‌ఎస్‌‌కు గ్రీన్‌‌కో రూ.41 కోట్లు.. 

ఫార్ములా–ఈ స్కామ్‌‌లో అప్పటి మున్సిపల్‌‌ మంత్రి కేటీఆర్‌‌‌‌, గ్రీన్‌‌కో సంస్థ వ్యవస్థాపకుడు, సీఎండీ చలమలశెట్టి అనిల్‌‌కుమార్‌‌‌‌, జాయింట్‌‌ ఎండీ మహేశ్ కొల్లి కీలకంగా వ్యవహరించినట్టు ఏసీబీ గుర్తించింది. 2022 ఏప్రిల్‌‌ 8, 9న గ్రీన్‌‌కో సంస్థ ద్వారా ఎలక్టోరల్‌‌ బాండ్స్ రూపంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌కు రూ.31 కోట్లు చేరాయి. ఈ క్రమంలో 2022 జూన్‌‌ 29న ఏస్‌‌ నెక్ట్స్ జెన్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ ఏర్పాటైంది. తరువాత అక్టోబర్‌‌‌‌10‌‌న గ్రీన్‌‌కో అనుబంధ సంస్థల నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌కు మరో రూ.10 కోట్లు ఎలక్టోరల్‌‌ బాండ్స్‌‌ ద్వారా వచ్చాయి. 

ఇలా మొత్తం రూ.41 కోట్లు గ్రీన్‌‌కో ద్వారా బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ అకౌంట్‌‌లోకి వచ్చినట్టు ఏసీబీ గుర్తించింది. ఇది జరిగిన తరువాత  గ్రీన్‌‌కో కంపెనీ.. కేటీఆర్‌‌‌‌ ఆధ్వర్యంలో ఫార్ములా–ఈ రేస్‌‌కు ప్రణాళికలు రూపొందించినట్లు ఆధారాలు సేకరించింది. ఏస్‌‌ నెక్ట్స్‌‌ జెన్‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌తో అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తులకు మార్కెటింగ్‌‌ చేసే విధంగా గ్రీన్‌‌కో వ్యవహరించింది. ఇందుకోసం బ్రిటన్‌‌కు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్లతో ఒప్పందాలు చేసుకుంది. 2022 అక్టోబర్‌‌‌‌ 25న ఎంఏయూడీ, ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌‌, గ్రీన్‌‌కో సిస్టర్‌‌‌‌ కంపెనీ ఏస్‌‌ నెక్ట్స్ జెన్‌‌ మధ్య  ఒప్పందం జరిగింది.

రెండుసార్లు కేటీఆర్ విచారణ‌‌.. 

నిధుల దుర్వియోగంపై పోయినేడు డిసెంబర్‌‌‌‌ 18న నాటి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్‌‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మరుసటి రోజే డిసెంబర్‌‌‌‌ 19న ఏసీబీ ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేసింది. హెచ్‌‌ఎండీఏ నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా చేస్తూ.. కేటీఆర్‌‌‌‌ను కేసులో ప్రధాన నిందితుడిగా, అప్పటి మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ అండ్‌‌ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ స్పెషల్‌‌ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అర్వింద్‌‌కుమార్‌‌‌‌, హెచ్‌‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌‌‌‌ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని నిందితులుగా చేర్చింది. 

దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జనవరి 8న అర్వింద్‌‌కుమార్‌‌, 9న కేటీఆర్‌‌,10న ‌‌బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డిని, అదే నెల18న గ్రీన్‌‌కో ఏస్‌‌ నెక్స్ట్‌‌జెన్‌‌ ఎండీ చలమలశెట్టి అనిల్‌‌కుమార్‌‌ను ఏసీబీ అధికారులు విచారించారు. ఆ తర్వాత జూన్‌‌ 16న కేటీఆర్‌‌‌‌‌‌ను రెండో దఫా ప్రశ్నించింది. ఈ క్రమంలోనే అర్వింద్‌‌కుమార్, బీఎల్‌‌ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ రెండుసార్లు విచారించింది. వీరిచ్చిన సమాచారంతో ఫార్ములా–ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను, సీఈవోను జూమ్‌‌ మీటింగ్‌‌ ద్వారా వర్చువల్‌‌గా ఎంక్వైరీ చేసింది. 

ఏసీబీ విచారణ సమయంలో కేసులో నిందితులైన అర్వింద్‌‌కుమార్, బీఎల్‌‌ఎన్‌‌రెడ్డి సహా ఈవెంట్‌‌ఆర్గనైజర్లు ఏస్‌‌ నెక్స్ట్‌‌జెన్‌‌, ఫార్ములా–ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు కేటీఆర్‌‌‌‌ పేరునే ప్రధానంగా ప్రస్తావించారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్ ఆదేశాల మేరకే చేసిన ఫార్ములా–ఈ రేసు ప్రపోజల్స్‌‌, లండన్ కంపెనీతో సంప్రదింపులు, అగ్రిమెంట్లు, చెల్లింపులకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ఏసీబీ సేకరించింది.