సకల జనుల పోరాటంతోనే తెలంగాణ  : నాగం జనార్దన్​రెడ్డి​ 

సకల జనుల పోరాటంతోనే తెలంగాణ  : నాగం జనార్దన్​రెడ్డి​ 

 

నాగర్​కర్నూల్,​ వెలుగు: నాతోనే తెలంగాణ వచ్చిందంటడు.. తెలంగాణకు ముందు, తర్వాత నేనే అంటడు.. సావును ముద్దాడిన అంటడు. ఇంకా ఏమేం అంటడో అని సీఎం కేసీఆర్​పై మాజీ మంత్రి డా.నాగం జనార్దన్​రెడ్డి ఫైర్​ అయ్యారు. 1969లో ఉద్యమం మొదలైనప్పుడు కేసీఆర్​ లాగులు కూడా సరిగ్గా కట్టలేదేమోనని ఎద్దేవా చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్​ మాటల తీరుపై తీవ్రంగా స్పందించారు.

సకల జనులు ఏకమై పోరాడితే  తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్​కు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత లేవన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పాడె కడితే భయపడి నిమ్స్​లో ఫ్లూయిడ్స్​ ఎక్కించుకుంటూ ఉద్యమం చేసిండని ఎద్దేవా చేశారు. శ్రీకాంతాచారి అగ్నికి ఆహూతి అయితే, హరీశ్​రావుకు మాత్రం అగ్గిపెట్టె దొరకలేదని విమర్శించారు. కేసీఆర్​ ఉద్యమం అంతా ఎలక్షన్లలో పొత్తులు పెట్టుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడమేనన్నారు. 1969లో ప్రాణాలు కోల్పోయిన 360 మంది అమర వీరుల కుటుంబాలను గుర్తించి వారిని గౌరవించాలన్న సంస్కారం కూడా లేదన్నారు.

 పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులోని ఏదులలో బీహెచ్ఈఎల్​ కంపెనీ 9 పంపులకు రూ.803 కోట్లు చార్జీ చేస్తే, ప్రభుత్వం మాత్రం మెగా కంపెనీకి రూ.2,436 కోట్లు ఇచ్చిందన్నారు. ఏపీ సర్కార్​ కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద అక్రమంగా కడుతున్న రాయలసీమ లిఫ్ట్​కు ప్రగతిభవన్​లో డిజైన్​ చేసిన కేసీఆర్​ దక్షిణ తెలంగాణ మీద కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.