అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం : కలెక్టర్ కుమార్ దీపక్

అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం : కలెక్టర్ కుమార్ దీపక్
  •     అనుమానాలుంటే తీరుస్తాం: కలెక్టర్

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశాలు పూర్తిగా అవాస్తవమని, ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అనుమానముంటే క్షేత్రస్థాయిలో నివృత్తి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మందమర్రి మండలం పొన్నారం గ్రామపంచాయతీ పరిధిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జల్ సంచాయ్ జన బాగీదారి కార్యక్రమంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేస్తేనే జాతీయస్థాయిలో జిల్లాకు అవార్డు వచ్చిందని స్పష్టం చేశారు. 

సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి, పనుల పురోగతి ఫోటోలను సంబంధిత పోర్టల్ లో అప్ లోడ్ చేయడంతో పాటు పనుల జియో ట్యాగింగ్ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై నెల రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ బృందం రాండం విజిట్ చేసి నిర్ధారించిన తరువాత ఫోటోలు అప్ లోడ్ చేశామన్నారు. ఉద్దేశపూర్వకంగా జిల్లా యంత్రాంగానికి అప్రతిష్ట తీసుకువచ్చేందుకు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది 

నస్పూర్, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ అన్నారు. బుధవారం మంచిర్యాలలో కల్యాణలక్ష్మి,  షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో లబ్ధిదారులకు అందజేశారు. మంచిర్యాల మండలానికి చెందిన 95 మందికి, హాజీపూర్ మండలానికి 43 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి సమర్థంగా అమలు చేస్తోందన్నారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అనేక వ్యాపారాలతో అభివృద్ధి చెందే దిశగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల, హాజీపూర్ తహసీల్దార్లు రహఫతుల్లా, శ్రీనివాస్ రావు దేశ్ పాండే, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.