ఆపరేషన్ సిందూర్ కు రాముడి ఆదర్శాలే స్ఫూర్తి.. దుష్టులకు సరైన గుణపాఠం చెప్పాం: రాజ్‌‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్ కు రాముడి ఆదర్శాలే స్ఫూర్తి.. దుష్టులకు సరైన గుణపాఠం చెప్పాం: రాజ్‌‌నాథ్ సింగ్
  •  అయోధ్యలో రెండో వార్షికోత్సవ వేడుకలు  

అయోధ్య: ఆపరేషన్ సిందూర్‌‌‌‌ టైమ్‌‌లో శ్రీరాముడి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ తెలిపారు. అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్టించి రెండేండ్లయిన సందర్భంగా బుధవారం ఆలయంలో ఆయన కాషాయ జెండా ఎగరేశారు. అనంతరం రాజ్‌‌నాథ్ మాట్లాడుతూ.. ‘‘శ్రీరాముడు వినయం, కరుణ వంటి సద్గుణాలు కలిగినవాడు. కానీ సమయం వచ్చినప్పుడు దుష్టులను శిక్షిస్తాడు. మేం కూడా ఆపరేషన్ సిందూర్ టైమ్‌‌లో శ్రీరాముడి ఆదర్శాలనే స్ఫూర్తిగా తీసుకున్నాం. 

రాముడి లక్ష్యం కేవలం రావణుడిని చంపడమే కాదు.. అధర్మాన్ని అంతం చేయడం. అలాగే మేం కూడా ఉగ్రవాదులకు, వాళ్లను పెంచిపోషిస్తున్నోళ్లకు సరైన గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టాం” అని పేర్కొన్నారు. మన పురాణాల్లో రాముడిది కేవలం ఒక ఆధ్యాయం, ఒక పాత్ర కాదని.. క్లిష్టమైన సమయాల్లో సమాజాన్ని నడిపించిన సజీవ శక్తి అని అభివర్ణించారు. 

అతిపెద్ద ఉద్యమాల్లో ఒకటి.. 

రామ జన్మభూమి ఉద్యమం ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాల్లో ఒకటని రాజ్‌‌నాథ్ పేర్కొన్నారు. ఇది ఐదు దశాబ్దాలకు పైగా సాగిందని తెలిపారు. ‘‘ఉద్యమం టైమ్‌‌లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. సాధువులు, భక్తులు బుల్లెట్లను, అరెస్టులను ఎదుర్కొన్నారు. కాలం అందరికీ న్యాయం చేస్తుందని చరిత్ర నిరూపించింది. రాముడికి, ధర్మానికి మద్దతుగా నిలిచినోళ్లు దేశానికి సేవ చేస్తుంటే.. ధర్మాన్ని అడ్డుకోవాలని చూసినోళ్లు ఓడిపోయారు. సామాజిక ఉద్యమం ఏదైనా సమాజం నుంచే పుడుతుంది. సమాజంలోని మార్పులకు అనుగుణంగా ఉద్యమం రూపాంతరం చెందుతుంది. 

ఎప్పుడు ఉద్యమం బలోపేతం అవుతుందో, అప్పుడు అదే సమాజ దిశను నిర్ణయిస్తుంది. రామ జన్మభూమి ఉద్యమం కూడా అలాంటిదే. ఇది చరిత్రను సృష్టించడమే కాదు.. వర్తమానానికి దిశానిర్దేశం చేసి, భవిష్యత్తుకు పునాది వేసింది” అని చెప్పారు. ‘‘దశాబ్దాల నిరీక్షణ అనంతరం రెండేండ్ల కింద అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించుకున్నాం. రాముడి రాకతో అయోధ్యతో పాటు ప్రపంచమంతా ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోతున్నది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.