- కేటీఆర్ హామీతో మెత్తబడ్డ మాజీ మంత్రి
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఫ్యామిలీ బీఆర్ఎస్‌లోనే కొనసాగనుంది. తాండూరు టికెట్ విషయంలో పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తిగా ఉన్న మహేందర్‌రెడ్డితో మంత్రి కేటీఆర్ ఇటీవల చర్చలు జరిపారు. పార్టీలోనే కొనసాగాలని తాండూరు, కొడంగల్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల కోసం పని చేయాలన్నారు.
మళ్లీ రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వడంతో మహేందర్ రెడ్డి మెత్తబడ్డారు. కొడంగల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మహేందర్ రెడ్డి తమ్ముడు నరేందర్ రెడ్డి ఉన్నారు. మిగతా స్థానాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనూ మహేందర్ రెడ్డికి విభేదాలున్నాయి. 2018 ఎన్నికల్లో మహేందర్ రెడ్డి తాండూరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్రెడ్డి చేతిలో ఓడిపోయారు.
తర్వాత రోహిత్రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లోనూ ఆయననే పోటీకి దించుతున్నారు. దీంతో పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న మహేందర్రెడ్డి..మంత్రి కేటీఆర్ జోక్యంతో అలక వీడారు. మహేందర్రెడ్డి గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్‌తో భేటీ కావాల్సి ఉండగా, పలు కారణాలతో కలవలేదని సమాచారం.
