
- బీసీలకు రిజర్వేషన్లు బిచ్చం కాదు: తలసాని
- పార్టీ పరంగా ఇస్తామంటే తీవ్ర పరిణామాలంటూ వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: బీసీ జేఏసీ బంద్ లో పల్లెల నుంచి పట్టణాల వరకు పాల్గొనాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆర్టీసీ స్వచ్ఛందంగా బస్సులు బంద్ చేయాలన్నారు. బీసీలు అసలే కోపంలో ఉన్నారని, ఎవరైనా బస్సులకు అగ్గి పెట్టినా తర్వాత మాకేం సంబంధం లేదని హెచ్చరించారు. గురువారం తెలంగాణ భవన్ లో పార్టీ బీసీ నేతల సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఎవరూ ఉండొద్దని, బీసీ పిల్లలు చాలా కోపంగా ఉన్నారని, ఎవరైనా ఏవైనా పగలగొట్టినా, కొట్లాటలు జరిగినా తమకు సంబంధం లేదని చెప్పారు. అందుకే అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని, బంద్ పాటించకుండా ఎవరెవరైతే ఓపెన్ చేస్తారో వాళ్లందరి పేర్లను తాము కూడా రాసిపెట్టుకుంటామని హెచ్చరించారు.
మాకు సహకరించకపోతే మీకు భవిష్యత్తులో సహకరించేది లేదన్నారు. కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. కాగా, ఈ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
42% రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలు పెట్టాలి: తలసాని
బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తలసాని అన్నారు. పార్టీల పరంగా 42ఇస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. షెడ్యూల్ 9లో చేర్చకుండా పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీసీలకు రిజర్వేషన్లు వాళ్లేమీ బిచ్చం వెసేది కాదన్నారు. బీసీలేం అడుక్కుతినేటోళ్లు కాదని తేల్చి చెప్పారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన తప్పుల తడకగా ఉందన్నారు. 18న తలపెట్టిన బీసీ జేఏసీ బంద్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదన్నారు.