కాంగ్రెస్ లోకి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్.​?

కాంగ్రెస్ లోకి  జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్.​?
  • రెండ్రోజుల్లో రేవంత్​రెడ్డి సమక్షంలో చేరిక  
  • సవాల్​గా మారనున్న జడ్చర్ల కాంగ్రెస్​ టికెట్ల పంచాయితీ

మహబూబ్​నగర్​, వెలుగు: జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్​ కాంగ్రెస్​లో చేరడం దాదాపు ఖాయమైంది. రెండు, మూడు రోజుల్లోనే ఇందుకు ముహూర్తం ఖరారు కానున్నట్టు తెలుస్తోంది. ఏడాదిన్నర కిందటే బీజేపీకి గుడ్​బై చెప్పి కాంగ్రెస్​లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. ఇందుకోసం పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డిని కలిసి, కేడర్​ను సిద్ధం చేసుకున్నారు. కానీ, అప్పట్లో ఆ పార్టీకి చెందిన కొందరు లీడర్లు అడ్డుకున్నారు. నిరుడు అక్టోబరు 11న పాలమూరులో జరిగిన ‘నిరుద్యోగ జంగ్​ సైరన్’ కార్యక్రమంలోనే ఎర్ర శేఖర్​ పార్టీలో చేరాల్సి ఉండగా.. బ్రేక్​ పడింది. తాజాగా ఆయన కాంగ్రెస్​ నుంచి కబురు అందినట్టు తెలిసింది. . హైదరాబాద్​లో పలువురు కార్పొరేటర్లు రెండు రోజుల్లో రేవంత్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో జాయిన్​ అవుతుండగా, ఇదే టైంలోనే ఎర్రశేఖర్ కూడా కాంగ్రెస్​ కండువా కప్పుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

బీసీ ఓట్లకు గాలం..

జడ్చర్ల నియోజకవర్గంలో బాలానగర్, రాజాపూర్, నవాబ్​పేట, జడ్చర్ల, మిడ్జిల్​ మండలాలు ఉన్నాయి. 202362 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 1,02,029, మహిళలు 1,00,331 మంది ఉన్నారు. వీరిలో 40 శాతం మంది ఓటర్లు బీసీలే. ఎర్రశేఖర్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన లీడర్. దీంతో ఆయనను కాంగ్రెస్​లో చేర్చుకుంటే ఆ వర్గానికి చెందిన ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకునేందుకు పార్టీ ప్లాన్​ చేసింది. ఈ క్రమంలోనే ఎర్రశేఖర్​ ఆ పార్టీలో చేరిన వెంటనే, నియోజకవర్గంలో విస్ర్తతంగా పర్యటనలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తన మద్దతుదారులతో కూడా ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం.

 టికెట్​ తమకే అంటున్న అనిరుధ్​రెడ్డి వర్గం

జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్​ టికెట్​ జనుంపల్లి అనిరుధ్​రెడ్డికి దక్కుతుందని ఆయన వర్గం లీడర్లు చెప్పుకుంటున్నారు. అనిరుధ్​రెడ్డి కూడా గ్రౌండ్​ వర్క్​ స్టార్ట్​ చేశారు. గ్రామాల్లో పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మండలాల్లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతిస్తున్నారు. ప్రత్యక్షంగా పాల్గొంటూ, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, నాలుగు నెలల కిందట ఈయన వర్గంతో పాటు మరో వర్గానికి జడ్చర్లలో జరిగిన పార్టీ కార్యక్రమంలో గొడవ జరిగింది. జడ్చర్లకు లీడర్ ఎవరో కన్ఫాం చేయాలనే దానిపై రచ్చ జరిగింది. తాజాగా ఇప్పుడు ఎర్రశేఖర్​ కాంగ్రెస్​లో చేరితే, పరిస్థితి ఏంటనే దానిపై కేడర్ చర్చించుకుంటోంది. కాగా, ఎర్రశేఖర్​ గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే పని చేశారు. ఆయన వర్గం లీడర్లు కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. అయితే, ఎర్రశేఖర్​ను పాలమూరు నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్​ భావిస్తున్నట్టు కొందరు సీనియర్​ లీడర్లు చెబుతున్నారు. అలా కుదరకపోతే ఎర్ర శేఖర్​ సొంత నియోజకవర్గమైన దేవరకద్ర నుంచి కూడా టికెట్​ ఇచ్చే చాన్స్​లు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, జడ్చర్ల నుంచే అనిరుధ్​రెడ్డి, ఎర్రశేఖర్​  టికెట్ల కోసం పట్టుబడితే.. ఎలాంటి పరిణామాలు ఉంటాయో అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.