ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ ఉద్యోగాల దందా సూత్రధారి కోరుకంటి చందర్ : గోపగోని మోహన్‌‌‌‌గౌడ్‌‌‌‌

ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ ఉద్యోగాల దందా సూత్రధారి  కోరుకంటి చందర్ : గోపగోని మోహన్‌‌‌‌గౌడ్‌‌‌‌
  • అసలు సబ్‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌ చందర్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌ బీఎస్‌‌‌‌ రాజు
  • మాజీ మంత్రి తన పీఏ ద్వారా 32 మందికి ఉద్యోగాలు ఇప్పించిండు
  • నేను తెర ముందు బొమ్మను మాత్రమే !
  • ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ ఏజెంట్ ​గోపగోని మోహన్‌‌‌‌గౌడ్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఫర్టిలైజర్స్‌‌‌‌ అండ్‌‌‌‌ కెమికల్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌లో కాంట్రాక్ట్‌‌‌‌ ఉద్యోగాల దందాలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అతని ఫ్రెండ్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌లో ఉండే బి.శ్రీనివాసరాజులు సూత్రధారులని కీలక ఏజెంట్‌‌‌‌ గోపగోని మోహన్‌‌‌‌గౌడ్‌‌‌‌ ఆరోపించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఉద్యోగ దందాలో తాను తెర మీద బొమ్మను మాత్రమేనన్నారు. తన మీద పీడీ యాక్ట్‌‌‌‌ పెడతామని బెదిరించడంతో ఆస్తులు ఆమ్మి బాధితులకు రూ.3 కోట్లు చెల్లించానని చెప్పారు. తాను సబ్‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌ను కాదని, డబ్బులు వసూలు చేసిన ఏజెంట్‌‌‌‌ను మాత్రమేనని పేర్కొన్నారు.

 మాజీ ఎమ్మెల్యే చందర్‌‌‌‌ చెబితేనే రూ. 3.60 కోట్లలో బీఎస్‌‌‌‌ రాజుకు కొంత డబ్బు, ఎన్టీపీసీలోని రెస్టారెంట్‌‌‌‌ ఓనర్, చందర్‌‌‌‌ సమీప బంధువుకు చెందిన అకౌంట్‌‌‌‌ ద్వారా మరికొంత పంపించానన్నారు. జనగామ శివారులో గోదావరి నది ఒడ్డున కొన్న భూములకు కోరుకంటి చందర్‌‌‌‌ సూచన మేరకు రూ.1.19 కోట్లు చెల్లించానన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని, భూముల కొనుగోలు వ్యవహారం పూర్తి కాగానే తనను తప్పించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చందర్‌‌‌‌ కొడుకు పేరు, గుండు రాజు, అతని సమీప బంధువుల పేర్లపై చేయించారని, ఇందులో ఓ ప్రముఖ వ్యక్తి పేరు కూడా పెట్టారన్నారు. ముంజ హరీశ్‌‌‌‌ ఆత్మహత్యకు తనకు సంబంధం లేదన్నారు. ఆయన వద్ద చందర్‌‌‌‌ బంధువు, సింగరేణి ఉద్యోగి, ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ దందాలో భాగస్వామి అయిన వ్యక్తే డబ్బులు తీసుకున్నాడని, హరీశ్‌‌‌‌ చనిపోయిన తర్వాత కేసులో తనను ఇరికించారన్నారు.

 ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ ఉద్యోగాల దందాలో 60 మంది ఏజెంట్లు ఉండగా, అందులో తాను ఒకడినని, కానీ తనను సబ్‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌ను చేసి తన జీవితంతో ఆడుకున్నారన్నారు. హైదరాబాద్‌‌‌‌లో జరిగిన అఖిల పక్ష మీటింగ్‌‌‌‌లోనూ ఈ విషయాన్ని చెప్పానన్నారు. అఖిలపక్ష తీర్మానంలో ఇంకా ఇద్దరి పేర్లు ఉన్నాయని, వారి నుంచి ఇప్పటిదాకా డబ్బులు రాలేదన్నారు. ఈ విషయాన్ని అడిగితే పీడీ యాక్ట్‌‌‌‌ పెడతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పీఏ ద్వారా ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌లో 32 మందికి ఉద్యోగాలు పెట్టించారన్నారు. ‘బీఎస్‌‌‌‌ రాజుకు, జనగామలో భూములకు చెల్లించిన డబ్బు కలిపి మొత్తం రూ.5.50 కోట్లు ఇచ్చాను. ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ బాధితులకు ఇచ్చినట్టుగానే నాకూ 45 శాతం డబ్బు ఇప్పించే బాధ్యత మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌దే, నోరెత్తితే చంపుతామని బెదిరిస్తున్నారు, చనిపోవడం కన్నా నిజాలు చెప్పాలనే ఆధారాలతో బయటకు వచ్చాను, నాకు ఏదైనా జరిగితే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్,అతని అనుచరులదే బాధ్యత’ అని ప్రకటనలో వెల్లడించారు.