
- ఠాక్రే సమక్షంలో పార్టీలో చేరిక
హైదరాబాద్, వెలుగు : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ఇన్ చార్జ్ మానిక్రావ్ఠాక్రే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మృత్యుంజయం మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ సర్కారును కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం వచ్చిందనీ, ప్రజలు బీఆర్ఎస్ను అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఉద్యమసమయంలో కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ చెప్పారనీ, కానీ దళితులకు ద్రోహం చేస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ తెలంగాణ ద్రోహి, దేశంలో ఏ సీఎం చేయనంత అవినీతి చేశారన్నారు. కేసీఆర్ అవినీతి గురించి మోదీ, అమిత్ షా సభల్లో ప్రకటనలు చేస్తారు కానీ చర్యలు మాత్రం తీసుకోరని ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ నేతలపైనే ఈడీ, ఐటీ రైడ్స్ చేస్తున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేననీ, వాటిని గద్దెదించేది కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు.