సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ రూల్​ సాధారణ భక్తులకేనా ?

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌  రూల్​ సాధారణ భక్తులకేనా ?
  •     యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌తో వెళ్లిన మాజీ ఎమ్మెల్యే సునీత, బీఆర్ఎస్‌‌‌‌ నాయకులు
  •     చూసీచూడనట్లు వ్యవహరించిన ఆఫీసర్లు
  •     ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌తో ఎవరూ వెళ్లకూడదన్న ఆర్డర్ కాగితాలకే పరిమితమైంది. ఆలయ ఉద్యోగులు, అర్చకులు, అవుట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ సిబ్బంది, ఎస్పీఎఫ్‌‌‌‌ పోలీసులతో పాటు జర్నలిస్టులు సైతం సెల్‌‌‌‌ఫోన్లతో ఆలయంలోకి వెళ్లొద్దంటూ ఈవో భాస్కర్‌‌‌‌రావు ఇటీవల ఆర్డర్స్‌‌‌‌ జారీ చేశారు. కానీ ఆ రూల్స్‌‌‌‌ సాధారణ భక్తులకే పరిమితం అయ్యాయి. 

వీఐపీలు వచ్చిన టైంలో కొందరు ఆఫీసర్లు, భద్రతా సిబ్బంది ఈ రూల్‌‌‌‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. భువనగిరి పార్లమెంట్‌‌‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ క్యామ మల్లేశ్‌‌‌‌ సోమవారం నామినేషన్‌‌‌‌ వేయడానికి ముందు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడిని దర్శించుకునేందుకు వచ్చారు. ఆయన వెంట ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు, మరో 30 మంది స్థానిక లీడర్లు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే మాజీ ఎమ్మెల్యే సునీతతో పాటు బీఆర్ఎస్‌‌‌‌ లీడర్లు సెల్‌‌‌‌ఫోన్లతోనే ఆలయంలోకి వచ్చారు. 

లీడర్ల జేబుల్లో, సునీత చేతిలో సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్పష్టంగా కనిపిస్తున్నా ఆలయ ఆఫీసర్లు, ఎస్పీఎఫ్‌‌‌‌ సిబ్బంది పట్టించుకోకుండా దగ్గరుండి మరీ దర్శనం కల్పించారు. దీంతో సాధారణ భక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించే ఆఫీసర్లు, పోలీసులు.. వీఐపీలు, రాజకీయ నాయకులు విషయంలో మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూల్స్‌‌‌‌ను సమానంగా అమలు చేయాల్సిన ఆఫీసర్లు సాధారణ భక్తుల పట్ల ఒక రకంగా, వీఐపీల పట్ల మరోరకంగా వ్యవహరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

కొందరు ఆఫీసర్ల తీరుతో ఇబ్బందులు

వీఐపీలు, రాజకీయ నాయకులు ఆలయానికి వచ్చిన టైంలో కొందరు ఆఫీసర్ల తీరుతో భద్రతాపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కొండపైన భద్రతను పర్యవేక్షించే ఓ పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనానికి వచ్చే నాయకులకు కొందరు ఆఫీసర్లు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో ‘సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ నాట్‌‌‌‌ అలోవ్డ్‌‌‌‌’ అని ధైర్యంగా చెప్పలేకపోతున్నామని వాపోయారు. ఈ విషయాలపై త్వరలోనే ఈవోతో చర్చిస్తామని చెప్పారు.