బీఆర్ఎస్​ సర్కారు చిప్ప చేతికిచ్చిపోయింది : కొండా విశ్వేశ్వర్​ రెడ్డి

బీఆర్ఎస్​ సర్కారు చిప్ప చేతికిచ్చిపోయింది : కొండా విశ్వేశ్వర్​ రెడ్డి
  • హామీల అమలుకు మళ్లీ అప్పులే చేయాల్సిన దుస్థితి: కొండా విశ్వేశ్వర్​రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: ప్రస్తుత కాంగ్రెస్​ సర్కారుకు గత బీఆర్ఎస్​సర్కార్​ చిప్ప చేతికిచ్చిపోయిందని బీజేపీ సీనియర్​నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పథకాలు, హామీల అమలుకు నిధులే లేవని అన్నారు. ప్రస్తుత స్కీమ్​లకు మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అయినా, రాష్ట్రం మేలు కోసం ఎఫ్​ఆర్​బీఎం పరిమితి దాటినా.. కేంద్ర ప్రభుత్వం అప్పులకు అనుమతిచ్చిందన్నారు. 

రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే అది మోదీ వల్లేనన్నారు. గత ఐదేండ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.9 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని చెప్పారు. గురువారం ఆయన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేఎస్​ రత్నంతో కలిసి పార్టీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. నలుగురు ఎంపీలుంటేనే అన్ని నిధులు వచ్చాయని.. 14 నుంచి 15 సీట్లు గెలిపిస్తే రూ.25 లక్షల కోట్లైనా తెస్తామని ఆయన చెప్పారు. 

మోదీకి ఓటెయ్యాలని తాము ప్రజలను అడగగలమని, కాంగ్రెస్​ నేతలు రాహుల్​ బాబాకు ఓటెయ్యాలంటూ ప్రజలను అడగలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ వాళ్లు అడిగినా డిపాజిట్లు కూడా రావన్నారు. అధిష్ఠానం ఇంకా తనకు సీటును కన్ఫర్మ్​ చేయలేదని, సీటు కేటాయిస్తే 2 లక్షల మెజారిటీతో గెలుస్తానని విశ్వేశ్వర్​ రెడ్డి చెప్పారు. టికెట్​ వచ్చినా రాకున్నా పార్టీ కోసం కష్టపడతానన్నారు. 

కాగా, రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వంతో పోలిస్తే.. కాంగ్రెస్​ ప్రభుత్వం కొంత నయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్, ఆయన కుమారుడిపై చర్యల కాంగ్రెస్​సర్కారు ఎందుకు ఉపేక్షిస్తున్నదని విశ్వేశ్వర్​ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీనే అనుకుంటున్నారని.. ఆవును వదిలి తోకను పట్టుకున్నట్టుగా కాంగ్రెస్​ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. 

బీజేపీపై విమర్శలు చేస్తూ సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడిన తీరు ఏమాత్రం బాగాలేదని కేఎస్​ రత్నం అన్నారు. ముందు కాంగ్రెస్​ గ్యారంటీలను అమలు చేయాలన్నారు. ఇప్పుడున్న చేవెళ్ల ఎంపీ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  కాంగ్రెస్​, బీఆర్​ఎస్​కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆయన పేర్కొన్నారు.