2 లక్షల 18 వేల మందితో హిందూ సైన్యం.. 'చతురంగిణి' సేన పేరుతో ఏర్పాటు

2 లక్షల 18 వేల మందితో హిందూ సైన్యం.. 'చతురంగిణి' సేన పేరుతో ఏర్పాటు
  • గో సంరక్షణ, సనాతన ధర్మ రక్షణ లక్ష్యం
  • కుల,లింగ భేదం లేకుండా సభ్యత్వం 
  • సంప్రదాయ, ఆధునిక ఆయుధాల్లో శిక్షణ 
  • మౌనీ అమావాస్యనాడు ప్రారంభిస్తం 
  • జ్యోతీష్ మఠ్ శంకరాచార్య అవిమక్తేశ్వరానంద

ఢిల్లీ: సనాతన ధర్మ పరిరక్షణ, గోసంరక్షణ కోసం 2.18 లక్షల మందితో "చతురంగిణి సేన" ఏర్పాటు చేయనున్నట్లు జ్యోతీష్ మఠ్ శంకరాచార్య అవిమక్తేశ్వరానంద ప్రకటించారు. ఈ దళంలో అన్ని వర్గాలకు చెందిన వారికి అవకాశం ఉంటుందని తెలిపారు. 

కుల, లింగ భేదం లేకుండా సభ్యత్వం ఇస్తామని చెప్పారు. గో సంరక్షణ, సనాతన ధర్మ రక్షణ కోసం ఈ సేన పనిచేస్తుందని పేర్కొన్నారు. సంప్రదాయ అస్త్రాలతో పాటు ఆధునిక ఆయుధాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ సైన్యం గోసంతులను, హిందూ మతాన్ని కాపాడుతుందని అన్నారు.

ఈ 'సైన్యంలో' అన్ని హిందూ కులాలకు చెందిన 2 లక్షల 18 వేల మంది సైనికులు ఉంటారని, వీరిలో పురుషులు, మహిళలు, థర్డ్ జెండర్లు కూడా ఉంటారని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్లో ఈ 'సైన్యాన్ని' ప్రారంభిస్తా మని అవిముక్తేశ్వరానంద్ తెలిపారు. పదాతి దళం, అశ్విక దళం, ఏనుగులు, రథాలు కలిగిన ఏ సైన్యాన్నైనా 'చతురంగిణి సేన' అని అంటారని శంకరాచార్యులు వివరించారు.

మహాభారతంలో చతురంగిణి సేన ప్రస్తావన ఉందని కూడా ఆయన చెప్పారు. సాధువులు, మద్దతుదారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ 'సైన్యం' మతం, సంస్కృతి, సమాజాన్ని పరిరక్షిస్తుందని అన్నారు. అవిముకేశ్వరానంద్, ఆయన మద్దతుదారులు గొడ్డళ్లను ప్రదర్శించారు. 

ఈ కొత్త 'సైన్యం' తన ఆయుధాగారంలో సంప్రదాయ, అధునాతన ఆయుధాలను కలిగి ఉంటుందని చెప్పారు. అవిముక్తేశ్వరానంద ప్రకటనపై విమర్శలు వస్తున్నాయి. లైసెన్స్ లేని ఆయుధాలను ఉంచుకోవడం, వాటిని బహిరంగంగా ప్రదర్శించడం చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చని ఒక సీనియర్ పోలీసు అధికారి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

వివాదాలకు కేరాఫ్
గత నెలలో, ప్రయాగ్ రాజ్లో జరిగిన మాఘ మేళా సందర్భంగా పల్లకిలో సంగమం వద్దకు వెళ్లడానికి అనుమతించకపోవడంతో, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను విమర్శించి అవిముక్తేశ్వరానంద వార్తల్లో నిలిచారు. గత నెలలో సాధువు అశుతోష్ బ్రహ్మచారి మహారాజ్ ఫిర్యాదు మేరకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు అవిముక్తేశ్వరానంద్పై పోక్సో కేసు నమోదు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 'బటుక్లు'గా పిలిచే యువ శిష్యులను ప్రయాగ్ రాజ్లోని శంకరాచార్యుల ఆశ్రమానికి తీసుకువచ్చి, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అశుతోష్ బ్రహ్మచారి ఆరోపించారు.

ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారి పేర్లను కూడా వెల్లడిస్తూ, స్వామి అవిముక్తేశ్వరానంద్తో పాటు ఆయన సహచరుడు, శిష్యుడు ముకుందానంద బ్రహ్మచారి, గురుభాయి శిష్యుడు అరవింద్, అలాగే ప్రకాష్ ఉపాధ్యాయ్ పేర్లు ప్రస్తావించారు. ఈ ఆరోపణలను అవిముక్తేశ్వరానంద్ ఖండిస్తూ, సనాతన ధర్మానికి హాని కలిగించే ఉద్దేశంతో చేసిన కల్పిత ఆరోపణలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఆయనకు సంఘీభావం ప్రకటించాయి.