పొలిటికల్ లీడర్స్ మస్త్ ఖుషీ: భారీగా పెరగనున్న అసెంబ్లీ, ఎంపీ సీట్లు..?

పొలిటికల్ లీడర్స్ మస్త్ ఖుషీ: భారీగా పెరగనున్న అసెంబ్లీ, ఎంపీ సీట్లు..?

న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో కీలక సంస్కరణ దిశగా ఎన్డీయే ప్రభుత్వం అడుగులేస్తుంది. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో కేంద్రం డీలిమిటేషన్ వైపు వడివడిగా అడుగులేస్తున్నట్లు తెలిసింది. ఈ పార్లమెంట్ సెషన్లోనే డీలిమిటేషన్పై పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

జనాభా లెక్కలతో సంబంధం లేకుండా లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలనే యోచనలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 543 నుంచి 816 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. ఈ డీలిమిటేషన్ తర్వాత చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. మహిళా రిజర్వేషన్ కోటాలో భాగంగా పెరిగే లోక్ సభ స్థానాల్లో స్త్రీలకు 273 స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది.

దేశంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా గణనీయంగా పెరగనుంది. ఈ డీలిమిటేషన్ జరిగితే 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. అతివలకు రాజకీయ ప్రాతినిధ్యం అనూహ్యంగా పెరుగుతుంది. ఇదిలా ఉండగా.. డీలిమిటేషన్లో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ నియోజవర్గాలు 4 వేల 123. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. ఈ సంఖ్య 6 వేల 185కి చేరనుంది. కొత్తగా 2 వేల 62 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ఈ మొత్తం 6 వేల 185 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలకు 2 వేల 42 స్థానాలు రిజర్వేషన్ కోటాలో భాగంగా కేటాయించాల్సి ఉంటుంది.

ఇక.. తెలంగాణలో లోక్ సభ స్థానాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. మరో 9 లోక్ సభ నియోజకవర్గాలు పెరిగి ఈ సంఖ్య 26కు చేరుతుంది. ఈ 26 లోక్ సభ స్థానాల్లో మహిళలకు 9 లోక్ సభ స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ప్రస్తుతం 119. కొత్తగా 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ సంఖ్య 179కి చేరుతుంది. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 175 స్థానాల నుంచి మరో 88 స్థానాలు పెరిగి 263కి చేరనుంది. ఏపీలో ప్రస్తుతం 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ జరిగితే మరో 12 లేదా 13 స్థానాలు పెరిగి ఈ సంఖ్య 25 నుంచి 37 లేదా 38కి పెరగనుంది.

►ALSO READ | తెలుగుతో పాటు భారత రాజ్యాంగంలో చోటు సంపాదించుకున్న 22 భాషలు ఇవే!

ఈ డీలిమిటేషన్ విధివిధానాలపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే వివరించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు  తమ పూర్వ వైభవాన్ని కోల్పోయి వివక్షను ఎదుర్కొనే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ అభ్యంతరాలు వస్తుండటంతో.. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం జనాభాతో సంబంధం లేకుండా సీట్లను దేశవ్యాప్తంగా ఏకరీతిగా 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయమై.. విపక్ష పార్టీలతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది. బుధవారం ఇదే అంశంపై కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరగనుంది.