- ఆయన ప్రధాని కాకపోయుంటే మన దేశం పాక్, శ్రీలంకలా తయారయ్యేది
- కాంగ్రెస్ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ కామెంట్
- ప్రజలు మూఢనమ్మకాల నుంచి బయటపడేలా కృషి చేశారని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వల్లే మన దేశం ఈరోజు ఇంతటి స్థాయిలో అభివృద్ధి చెందిందని ఎకనామిక్స్ ప్రొఫెసర్, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ (మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు) అన్నారు. ఆయన ప్రధాని కాకపోయి ఉంటే ఈరోజు మన దేశం పాకిస్తాన్, శ్రీలంకలా అయ్యేదని పేర్కొన్నారు. “స్వాతంత్ర్యం నుంచి స్వావలంబన వరకు: శాస్త్రీయ, ఆధునిక భారతదేశంపై నెహ్రూ దార్శనికత” అనే అంశంపై ఆదివారం ఖైరతాబాద్‌లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌లో విజ్ఞాన దర్శిని, ది నెహ్రూ సెంటర్ ఆధ్వర్యంలో సెమినార్ జరిగింది.
దీనికి సందీప్ దీక్షిత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ, నాగార్జున సాగర్, భాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ వల్లే సాకారమయ్యాయని చెప్పారు. ‘‘ప్రపంచ భవిష్యత్తు సైన్స్ మీద ఆధారపడి ఉందని నెహ్రూ నమ్మారు.
ప్రజలు మూఢనమ్మకాలు వదిలి సైన్స్ నే నమ్మాలని చెప్పేవారు. మూఢనమ్మకాల నుంచి దేశాన్ని బయటపడేసి, ప్రజల్లో వైజ్ఞానిక స్పృహను పెంపొందించడానికి నెహ్రూ ప్రాధాన్యతనిచ్చారు. భారతదేశాన్ని ఆధునిక దేశంగా తీర్చిదిద్దడంలో ఆయన వేసిన పునాదులు వెలకట్టలేనివి. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేందుకు తీసుకున్న చొరవ అద్భుతం” అని దీక్షిత్ వ్యాఖ్యానించారు.
ఆధునిక భారత నిర్మాత నెహ్రూ: మహేశ్ గౌడ్
ఆధునిక భారతదేశానికి పునాదులు వేసిన గొప్ప దార్శనికుడు నెహ్రూ అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడడానికి నెహ్రూ వేసిన పునాదులే నేటికీ భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టాయని గుర్తుచేశారు. “ఐఐటీలు , ఎయిమ్స్, ఇస్రో వంటి ప్రతిష్టాత్మక విద్యా, శాస్త్రీయ సంస్థల ఏర్పాటు నెహ్రూ దూరదృష్టికి నిదర్శనం.
భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి దేశాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపించారు. భారత తొలి ప్రధానిగా ఆయన పాత్ర మరవలేనిది. అలీన విధానం ద్వారా అంతర్జాతీయ వేదికలపైనా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు” అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
