మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత

మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో తుదిశ్వాస విడిచారు. 70 ఏళ్లపాటు  క్రియాశీలకంగా పనిచేసి మచ్చలేని నేతగా పేరుపొందారు.  కాంగ్రెస్, టీడీపీ, లోక్ సత్తాలో పనిచేసిన  రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి చిన్న కూతురును ఆయన పెద్ద కొడుకు వెంకటేశ్వర్ రెడ్డి చేసుకున్నారు. రామచంద్రారెడ్డి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ఫిలినగర్ లో  జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

 సిద్దిపేట జిల్లా  దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సోలిపేట రామచంద్రారెడ్డి  సర్పంచ్ నుంచి ఎంపీ వరకు  రాజకీయాల్లోకి ఎదిగారు. తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. సిటీ కాలేజీలో పట్టభద్రులైన రామచంద్రారెడ్డి తర్వాత రాజకీయాల్లో పూర్తి కాలం పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా.. గతంలో దొమ్మాట ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 

ALSOREAD:జులై15న బీసీల రాజకీయ ప్లీనరీ..జాజుల శ్రీనివాస్ గౌడ్

 సోలిపేట రామచంద్రారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొలితరం కమ్యూనిస్టు నేత రామచంద్రారెడ్డి జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు.తెలంగాణ మరో తొలితరం ప్రజా నేతను కోల్పోయిందన్నారు.  మచ్చలేని నాయకుడిగా 70 ఏళ్ల పాటు ఆయన రాజకీయ సేవలు మరిచిపోలేనివన్నారు.