
- భద్రాచలం ఆదివాసీ ధర్మయుద్ధం బహిరంగ సభలో మాజీ ఎంపీ సోయం బాపురావు
భద్రాచలం, వెలుగు: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు ఉద్యమం ఆపేది లేదని ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు హెచ్చరించారు. భద్రాచలంలో ఆదివారం 9 ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, వివిధ జిల్లాల ఆదివాసీలతో బూర్గంపాడు మండలం సారపాక నుంచి భద్రాచలంలోని జూనియర్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. బైక్‌లు, కార్లు, ఎడ్లబండ్లు, లారీలు, బస్సుల్లో వేలాది మంది ఆదివాసీలు తరలివచ్చారు.
ఆదివాసీల నినాదాలతో భద్రాచలం పట్టణం మార్మోగింది. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాటి వెంకటేశ్వర్లు, ఆదివాసీ సంఘాల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ, కొర్స వెంకటేశ్వర్లు, పొడియం బాలరాజు, ఏటీఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయబాబు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్ తదితరులు హాజరై మాట్లాడారు.
50 ఏళ్లుగా ఆదివాసీలు అన్నిరంగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొడ్డిదారిన లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారని, అప్పటి నుంచి ఆదివాసీలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబరు 9న హైదరాబాద్‌లో 6 లక్షల మందితో, దీపావళి తరువాత ఆదిలాబాద్‌లో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు.