నాన్నకు క్రికెట్ అంటే చాలా ఇష్టం: వివేక్ వెంకటస్వామి

నాన్నకు క్రికెట్ అంటే చాలా ఇష్టం: వివేక్ వెంకటస్వామి
  • హైదరాబాద్​లో స్టేడియం నిర్మించాలనే కోరిక ఉండేది
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి
  • ఓయూలో కాకా వెంకటస్వామి టోర్నమెంట్ ప్రారంభం

 ఓయూ, వెలుగు :  కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకట స్వామి 93వ జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం ఓయూలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.  ఓయూ జేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్ ఆద్వర్యంలో ఉస్మానియా వర్సిటీ గ్రౌండ్​లో మొదలైన ఈ పోటీలను మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాన్న క్రికెట్​ను చాలా ఇష్టపడేవారు. హైదరాబాద్​లో ఓ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఆయనకు కోరిక ఉండేది. అందుకోసమే అప్పట్లో విశాక ఇండస్ట్రీలో పైసలు లేకున్నా బ్యాంకులో లోన్ తీసుకుని ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం కాకా వెంకటస్వామి జ్ఞాపకార్దం క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉంది’’ అని వివేక్ తెలిపారు. 

ఈ టోర్నమెంట్​లో గెలుపొందిన క్రీడాకారులకు ఈ నెల 5న కాకా జయంతి రోజున ప్రైజ్​లు అందిస్తామన్నారు. జేఏసీ చైర్మన్ సురేశ్ యాదవ్ మాట్లాడుతూ.. పేదల కోసం పోరాడిన కాకా వెంకటస్వామి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.