టీఆర్​ఎస్​ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలి

 టీఆర్​ఎస్​ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలి

కామారెడ్డి, పిట్లం, వెలుగు:సీఎం కేసీఆర్​ను గద్దె దించితేనే రాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. టీఆర్​ఎస్ ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయిందని విమర్శించారు. ఈ బోనాల పండుగతోనైనా కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెరుగైన పాలన అందుతోందన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలో నాలుగో రోజు ‘ప్రజా గోస-–బీజేపీ భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. వివేక్ వెంకటస్వామి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార ఊర్లలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అన్నారం, బ్రాహ్మణపల్లి, చిల్లర్గి, రాంపూర్, గౌరారం, బొలక్​పల్లె, మద్దెల చెరువు, బండపల్లి, కొమట్ చెరువు తండాల్లో వర్షంలో తడుస్తూనే వివేక్ వెంకటస్వామి పర్యటన కొనసాగించారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగరేసి మాట్లాడారు. 

రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది

‘‘రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. ప్రజా సమస్యలు పక్కన పెట్టిన కేసీఆర్.. కుటుంబ ఆస్తులు పెంచుకోవడంపై శ్రద్ధ పెడుతున్నరు. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొవడం, ప్రజా సమస్యలు పట్టకుండా ఫామ్​హౌస్​లో పడుకోవడం ఆయనకు అలవాటు” అని వివేక్ అన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టివ్వలేదన్నారు. దళితబంధు టీఆర్​ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని విమర్శించారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆయన ఫామ్​హౌస్​కు మాత్రమే నీళ్లు వచ్చాయని ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి, కమీషన్లు దండుకొని ఆయన కుటుంబాన్ని మాత్రమే బంగారు మయం చేసుకున్నారని విమర్శించారు. ప్రజలపై కరెంటు బిల్లులు, బస్సు చార్జీల భారం మోపారన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే మంచి పాలన

దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెరుగైన పాలన ఉందని వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో దేశంలో నాలుగు కోట్ల ఇండ్ల నిర్మాణం చేశారన్నారు. యూపీలో సీఎం యోగి ఆధిత్యనాథ్ 50 లక్షల ఇండ్లు కట్టి పేదలకు ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 16 లక్షల ఇండ్ల నిర్మాణానికి నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారని ఆరోపించారు. మన రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే సమస్యలన్ని తీరుతాయన్నారు. కార్యక్రమంలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఫండ్స్ వచ్చేలా చూస్తానని చెప్పారు. కొన్నాళ్ల క్రితం చిల్లర్గిలో యాక్సిడెంట్​లో చనిపోయిన 11 మంది బాధిత ఫ్యామిలీలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఫండ్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, కాటిపల్లి వెంకటరమణరెడ్డి, అభినయ్​రెడ్డి, సాయిలు, రామ్ తదితరులు పాల్గొన్నారు.