
నాగర్ కర్నూల్, వెలుగు: తమ పొలానికి వెళ్లే బాటను మూసేశారని మాజీ ఎంపీటీసీ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం జనుంపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన శేషయ్య మాజీ ఎంపీటీసీ సభ్యుడు. అతనికి సర్వే నంబర్172లో11 ఎకరాల పొలం ఉంది. దానికి సమీపంలోనే అధికారులు ప్రస్తుతం పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక నిర్మిస్తున్నారు. కాగా 20 ఏండ్లు అటు వైపుగానే పొలానికి వెళ్తున్నామని, తనకి బాట వదిలి నిర్మాణాలు చేపట్టాలని శేషయ్య సర్పంచ్భర్తను ప్రాధేయపడ్డాడు. అదేం పట్టించుకోకుండా నిర్మాణాలు చేపడుతుండడంతో మంగళవారం తన భార్య సాలమ్మ, కొడుకు శ్రీశైలంతో కలిసి శేషయ్య మంగళవారం పొలానికి వెళ్లే బాటలో పురుగులు మందు తాగారు. స్థానికులు గమనించి జిల్లా కేంద్రంలోని హాస్పిటల్కు తరలించారు. సర్పంచ్భర్త ఉద్దేశపూర్వకంగానే పొలం బాటను ఆక్రమించి శ్మశానం, ప్రకృతి వనం నిర్మిస్తున్నాడని శేషయ్య బంధువులు ఆరోపించారు. ఎంత బతిమలాడినా వినలేదని చెప్పారు. కరోనా పేరుతో గ్రామ సభ నిర్వహించకుండా, ఎలాంటి తీర్మానాలు చేయకుండానే స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది.