బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దారెటు?

బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దారెటు?

అయోమయంలో నకిరేకల్ ​మాజీ ఎమ్మెల్యే 
బీఆర్ఎస్​లో డోర్లు క్లోజ్.. 
కాంగ్రెస్​లో డైలమా
సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తికే 
నకిరేకల్​ టికెట్ అని సంకేతాలు పంపిన బీఆర్ఎస్ ​హైకమాండ్​
కాంగ్రెస్​లో చేరుతాడనే ప్రచారానికి ఎంపీ కోమటిరెడ్డి బ్రేక్​


నల్గొండ, వెలుగు: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పొలిటికల్ కేరీర్ రసకందాయంలో పడింది. ఇన్నాళ్లూ బీఆర్ఎస్​ హైకమాండ్ పై నమ్మకం పెట్టుకున్న ఆయన ఆశలు దాదాపు కనుమరుగయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే టికెట్ ఖాయమని హైకమాండ్​ సంకేతాలు పంపడంతో వీరేశానికి రూలింగ్​పార్టీలో తలుపులు మూసుకుపోయాయి. ఈ క్రమంలో వీరేశం పార్టీ మారకుండా ఉండేందుకు ఆయన ముందు పలు ఆఫర్లు పెట్టినట్లు తెలిసింది. నకిరేకల్​లో బీఆర్ఎస్ గెలుపుకు సహకరిస్తే కార్పొరేషన్​పదవి లేదంటే విప్ హోదాతో ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నట్లు వీరేశం సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఈ ఆఫర్లను తిరస్కరించిన వీరేశం ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని హైకమాండ్​కు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్​లో చాన్స్ తప్పక ఉంటుందని వీరేశం వర్గీయులు భావించారు.  కానీ కాంగ్రెస్​లో సీట్లు ఖాళీ లేవని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఆల్రెడీ రిజర్వ్ అయ్యాయని స్టార్​ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బుధవారం హైదరాబాద్​లో స్పష్టం చేశారు. నకిరేకల్ వీరేశం, కోదాడకు చెందిన శశిధర్​రెడ్డి చేరికల అంశం తనకు దృష్టికి రాలేదన్నారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలతో వీరేశం ఎలాంటి రాజకీయ వ్యూహాన్ని రూపొందిస్తారనేది ఆసక్తి రేపుతోంది.

కాంగ్రెస్​లో బెర్త్​ కష్టమే..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితోపాటే వీరేశం పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. కానీ సీనియర్లతో నిండిన నల్గొండ కాంగ్రెస్​లో చేరిక ఆషామాషీ వ్యవహారం కాదని ఆయనకు ఆలస్యంగా బోధపడింది. సీనియర్లు అంగీకరిస్తే తప్పా కాంగ్రెస్​ బెర్త్ ​దొరకడం కష్టం. పైగా వీరేశం పార్టీలో చేరితే ఒనగూరే ప్రయోజనాలపై ఇప్పటికే ఒక దఫా చర్చ జరిగినట్లు తెలిసింది. నల్గొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం నడుస్తోంది. గత మూడు ఎన్నికల్లో బ్రదర్స్ ప్రతిపాదించిన వ్యక్తులకే నకిరేకల్ టికెట్ దక్కింది. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డితో వీరేశానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. దీంతో వీరేశానికి ఢోకా ఉండదనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ తాజాగా ఎంపీ వెంకటరెడ్డి చేసిన కామెంట్లు అందుకు భిన్నంగా ఉండటంతో వీరేశం పరేషాన్​లో పడ్డారు.

తుంగతుర్తి కోసమే ఆపారా?  
12 సీట్లు రిజర్వు అయ్యాయని ఎంపీ కోమటిరెడ్డి చెబుతున్నప్పటికీ ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మిర్యాలగూడ, మునుగోడు అభ్యర్థుల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వీరేశం పార్టీలోకి వస్తే నకిరేకల్ కంటే తుంగతుర్తిలోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నా రు. మాదిగ సామాజిక వర్గం ఓటర్లు తుంగతుర్తిలో ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. మరోవైపు వీరేశం స్వగ్రామం శాలిగౌరారం మండలం ఉట్కూరు కాగా, భార్య పుష్ప స్వగ్రామం మోత్కురు మండలం కోటమర్తి. ఇవి రెండు తుంగతుర్తి నియోజకవర్గంలోనే ఉన్నాయి. రాజకీయ కోణంలో చూస్తే.. నకిరేకల్ టికెట్ నల్గొండ పాత రాజకీయాలతో ముడిపడి ఉన్నందునే పార్టీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా నకిరేకల్​కేంద్రంగా వీరేశాన్ని రంగంలోకి దింపితే ఇప్పుడున్న కాంగ్రెస్ శ్రేణులు సహరించే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో నల్గొండ, నకిరేకల్​లో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని, తుంగతుర్తి అయితే ఎలాంటి సమస్య ఉండదని సీనియర్లు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.