న్యూఢిల్లీ: ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) మాజీ ప్రెసిడెంట్, వెటరన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ రణ్‌ధీర్ సింగ్ (79) బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య వినీత, ముగ్గురు కుమార్తెలు (మహిమ, సునైనా, రాజేశ్వరి) ఉన్నారు. కుమార్తె రాజేశ్వరి కూడా షూటర్ కావడం గమనార్హం.
రణధీర్ సింగ్ పార్థివ దేహానికి గురువారం మధ్యాహ్నం హరిద్వార్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. క్రీడల నిర్వహణలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న రణ్‌ధీర్ 1991 నుంచి 2015 వరకు ఓసీఏ సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. 2024లో నాలుగేళ్ల కాలానికి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
రణధీర్ సింగ్ తన క్రీడా జీవితంలో ఐదుసార్లు ఒలింపిక్స్‌లో (1964 టోక్యో, 1968 మెక్సికో, 1972 మ్యూనిచ్, 1976 మాంట్రియల్, 1980 మాస్కో, 1984 లాస్ ఏంజెల్స్) పాల్గొన్నారు. 1978 బ్యాంకాక్ ఆసియా గేమ్స్ ట్రాప్ షూటింగ్‌లో చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిభకు గుర్తింపుగా 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘అర్జున అవార్డు’తో సత్కరించింది.
