ఎయిమ్స్‌ నుంచి  మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ డిశ్చార్జ్‌

ఎయిమ్స్‌ నుంచి  మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ డిశ్చార్జ్‌

దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి  మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు. ఈనెల 13న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆ తర్వాత డెంగీ నిర్ధారణ అయినట్లు డాక్టర్లు  నిర్ధారించారు. ఆయన పరిస్థితి మెరుగవడంతో ఇవాళ(సోమవారం) ఇంటికి చేరుకున్నారు. మన్మోహన్ డెంగీ నుంచి కోలుకుంటున్నారని ఆయన అర్ధాంగి గురుశరణ్ కౌర్ తెలిపారు. మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చడంలో ఎంతో శ్రమించిన ఎయిమ్స్ డాక్టర్లకు, నర్సులకు, ఇతర సహాయక సిబ్బందికి, మన్మోహన్ క్షేమాన్ని కాంక్షించిన శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆమె వివరించారు. మన్మోహన్ ఆస్పత్రి డిశ్చార్జ్ కావడంతో ఆయన కుటుంబంతో పాటు కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో  కరోనా వైరస్ బారిన పడిన మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో  చేరారు. ఆ సమయంలో నెల రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత మన్మోహన్ డిశ్చార్జ్ అయ్యారు.

రెండు సార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు అన్ని పార్టీల నుంచి అభిమానులున్నారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, నిర్ణయాలపై ప్రశంసలు అందుకున్నారు.