టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్

టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ  రాపోలు ఆనంద్ భాస్కర్

మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోల్ ఆనంద్ భాస్కర్ గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఆనంద్ భాస్కర్ కారెక్కారు. ఈసందర్భంగా ఆనంద్ భాస్కర్కు గులాబీ కండువా కప్పిన మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. 

చేనేతపై కేంద్రం జీఎస్టీ వేసింది

చేనేతకు చేయూత ఇవ్వాల్సిన కేంద్రం దుర్మార్గంగా 5 శాతం జీఎస్టీ వేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.  నేతన్నను కేంద్రం పట్టించుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తరపున  రూ. 100 కోట్లు కేటాయించి 26 వేల మంది కార్మికులకు కరోనా టైంలో పంపిణీ చేశామని చెప్పారు.  సూరత్ కు వలసపోయిన చేనేత కార్మికులు వెనక్కు రావాలని సీఎం కేసీఆర్ కార్యచరణ రూపొందించారని..అందులో భాగంగానే గద్వాల, నారాయణపేట్, సిరిసిల్లలలో చేనేత పార్కులు ఏర్పాటు చేశామన్నారు. 

నన్ను అవమానించారు..అందుకే రాజీనామా

మాజీ రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. రాజీనామా లేఖలో రాపోలు... పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గడిచిన నాలుగేండ్లలో పార్టీ నాయకత్వం తనని విస్మరించిందని ఆరోపించారు. తనను ఎన్నోసార్లు అవమానించారని, తక్కువ చేసి చూశారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో తనకి ప్రాధాన్యం లేకుండా చేసినా ఆవమానాలను దిగమింగుతూనే వచ్చానన్నారు.    

పాత్రికేయుడి నుంచి..రాజ్యసభ వరకు..

జర్నలిస్ట్గా పనిచేసిన ఆనంద భాస్కర్ రావు 2012 నుంచి 2018 వరకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2019లో ఆ పార్టీకి రాజీనామా చేసి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి..బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు.