ఆర్థిక స్థిరత్వ నిర్ధారణ కేంద్ర బ్యాంకుల బాధ్యత : దువ్వూరి సుబ్బారావు

ఆర్థిక స్థిరత్వ నిర్ధారణ  కేంద్ర బ్యాంకుల బాధ్యత : దువ్వూరి సుబ్బారావు
  • ఆర్బీఐ మాజీ గవర్నర్​ దువ్వూరి సుబ్బారావు

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం, బ్యాకింగ్, బ్యాంకింగేతర సంస్థలను నియంత్రించడం కేంద్ర బ్యాంకుల బాధ్యత అని ఆర్బీఐ మాజీ గవర్నర్​ దువ్వూరి సుబ్బారావు అన్నారు. సరఫరాలో లోపాలు, పన్ను సర్దుబాట్లు, సబ్సీడీల విషయంలో మాత్రం ప్రభుత్వ ఆర్థిక జోక్యం అవసరమన్నారు. 

 

గీతం డీమ్డ్​ వర్సిటీ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​ ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకుల ఆర్థిక విధి, కేంద్ర బ్యాంకింగ్ భవిష్యత్​ అనే అంశాలపై వర్క్​షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దువ్వూరి మాట్లాడుతూ వృద్ధి, ఉపాధి, ధరలు, ఆర్థిక స్థిరత్వం అనేవి ఆర్బీఐ ప్రధాన లక్ష్యాలన్నారు. ద్రవ్య విధానం, రెపో రేటు, పెట్టుబడి, జీడీపీ వినియోగం లాంటివి ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయన్నారు. 

ద్రవ్యోల్బణం పేదలపై అతిపెద్ద పన్నుగా అభివర్ణించిన దువ్వూరి కరెన్సీపై విశ్వాసాన్ని కొనసాగించి కేంద్ర బ్యాంకులు స్వీయ సంతృప్తిగా మారడమే మార్గమని సూచించారు. కరెన్సీ ముద్రణ, పంపిణీతో పాటు విదేశీ మారక రేట్లను నిర్వహించడం, ప్రభుత్వాలు, బ్యాంకులకు బ్యాంకర్​గా పనిచేస్తూ ఆర్బీఐ ఆర్థికాభివృద్ధిని అందరి దరికి చేరుస్తోందన్నారు. 

2008 ఆర్థిక సంక్షోభాన్ని గుర్తు చేస్తూ ఆర్బీఐ గవర్నర్​గా తన అనుభవాలను దువ్వూరి పంచుకున్నారు. కార్యక్రమంలో జీఎస్​బీ డైరెక్టర్​ దివ్యకీర్తి గుప్తా, పీజీ హెడ్ ప్రొఫెసర్​ రనజీ, అజయ్ కుమార్​, ఎస్​శాండిల్య, ఆర్​ఎస్​ మీనాక్షి, అన్సికా పాల్గొన్నారు.