ధరలు, నిరుద్యోగం తెలంగాణలోనే ఎక్కువ : పి.చిదంబరం

ధరలు, నిరుద్యోగం తెలంగాణలోనే ఎక్కువ : పి.చిదంబరం

రాష్ట్రంలో కేసీఆర్​ సర్కార్​ అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయిందని కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ మెంబర్​ పి. చిదంబరం విమర్శించారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం భారీగా ఉందన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే ధరలు, నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉందన్నారు. గురువారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్​ గ్యాస్ ధరలు రాష్ట్రంలోనే ఎక్కువని, వ్యాట్ ఎక్కువగా వసూలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పురుషుల్లో 7.8, మహిళల్లో 9.5 శాతంగా ఉందని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో 15.1 శాతంగా నిరుద్యోగ రేటు రికార్డయిందని విమర్శించారు. రాష్ట్రంలో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 20 వేల టీచర్​ పోస్టులనూ భర్తీ చేయలేదని ఫైర్​ అయ్యారు. టీఎస్​పీఎస్సీలో 22 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్​కాగా.. సీఎం కేసీఆర్​ ఒక్కరికీ నిరుద్యోగ భృతిని అందించలేదని, తన హామీని నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో సర్కారు విఫలమైందన్నారు. రాష్ట్ర అప్పులు రూ.3.66 లక్షల కోట్లకు పెరిగాయని, ఒక్కొక్కరిపై రూ.96 వేల భారం పడిందని చిదంబరం అన్నారు. 

అది ప్రజా ఉద్యమం.. కేసీఆర్​ది కాదు..

తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమమని, కేసీఆర్​ది ఏ మాత్రమూ కాదని చిదంబరం అన్నారు. కేసీఆర్​ వల్లే తెలంగాణ వచ్చిందనడం పొరపాటని అన్నారు. ఉద్యమంలో వందలాది మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఏపీ కోసం పొట్టి శ్రీరాములు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారన్నారు. ఆయనతో పోలిస్తే చావు నోట్లో తలపెట్టి వచ్చానంటున్న కేసీఆర్​ ఏమీ గొప్పోడు కాదని కామెంట్ చేశారు. ఎవరు ఏందనేది ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని, కేసీఆర్​కు ప్రజలే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.

పార్టీలో సీఎం అభ్యర్థులపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్​లో 12 మంది సమర్థమైన లీడర్లున్నందుకు మంచిదే కదా అని అన్నారు. పార్టీలో సీఎం అభ్యర్థి ఎంపిక ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతుందన్నారు. లిక్కర్​ స్కామ్​లో కవిత పాత్ర గురించి తనకు తెలియదని, ఆమెపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​, చార్జిషీట్​లో ఏముందో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు.