జైపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..

జైపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జైపాల్ రెడ్డి…. ఆదివారం పొద్దున  తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన జ్వరం రావడంతో ఈ నెల 20 ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టో ఎంటరాలజీ హాస్పిటల్ లో చేరారు. కొద్దిరోజులుగా నిమోనియాతో బాధపడుతున్నారు. జ్వరంతో పాటు.. నిమోనియాకు డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. అయితే.. అనారోగ్యం తీవ్రమవడంతో.. తెల్లవారుజామున చనిపోయారు.

కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆయన.. 1942 జనవరి 16 న జన్మించారు. ఆయన స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల. చిన్న వయసులోనే పోలియో ఎటాక్ అయినా.. ధైర్యంగా ముందుకెళ్లి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తిచేసిన ఆయన మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు.  కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1969 మరియు 1984 మధ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

1984లో మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. తర్వాత మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుంచి 1999 మరియు 2004 లో రెండు సార్లు ఎంపీ అయ్యారు. 2009 లో చేవెళ్ల నుంచి ఎంపీగా విజయం సాధించారు.  1990 మరియు 1996 లలో రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు జైపాల్ రెడ్డి. 1991-1992  మధ్యకాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎన్నికయ్యారు. దక్షిణాదిరాష్ట్రాల నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎన్నికైన మొదటి వ్యక్తి జైపాల్ రెడ్డి.

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆయన.. 1977లో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ.. జనతాపార్టీలో చేరారు. 1985 నుండి 1988 వరకు జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1998లో ఐకే గుజ్రాల్ ప్రభుత్వంలో కేంద్ర సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత.. 1999లో తిరిగి కాంగ్రెస్ లో చేరారు.1999 నుంచి 2000 వరకు సభా హక్కుల ఉల్లంఘన కమిటి చైర్మెన్ గా పని చేశారు జైపాల్ రెడ్డి. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ కేబినెట్ లో  పెట్రోలియం, పట్టణాభివృద్ధి , సాంస్కృతికశాఖ మంత్రిగా పని చేశారు.