RR vs KKR: పరాగ్ అసమాన పోరాటం వృధా.. ఒక్క పరుగు తేడాతో కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ

RR vs KKR: పరాగ్ అసమాన పోరాటం వృధా.. ఒక్క పరుగు తేడాతో కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్ 2025 లో మరో రసవత్తర మ్యాచ్ అభిమానులకి కిక్ ఇచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం (మే 4) రాజస్థాన్ రాయల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ (45 బంతుల్లో 95:6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒంటరి పోరాటానికి తోడు చివర్లో శుభం దుబే (25) కోల్‌కతా నైట్ రైడర్స్ ను వణికించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల చేసి ఓడిపోయింది. 

ALSO READ | RR vs KKR: పరాగ్ విశ్వరూపం.. 5 బంతులకి 5 సిక్సర్లు కొట్టిన రాజస్థాన్ కెప్టెన్

206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు తొలి ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(4) తొలి బంతికి ఫోర్ కొట్టి రెండో బాల్ కు ఔటయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన కొత్త బ్యాటర్ కునాల్ సింగ్ రాథోర్ 5 బంతుల్లో డకౌటయ్యాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన దశలో జైశ్వాల్ తో జత కలిసిన కెప్టెన్ రియాన్ పరాగ్ బౌండరీలతో హోరెత్తిచారు. ముఖ్యంగా జైశ్వాల్ పవర్ ప్లే లో తనదిన షాట్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్ లో పరాగ్ కూడా బ్యాట్ ఝులిపించడంతో తొలి 6 ఓవర్లలో రాజస్థాన్ 59 పరుగులు రాబట్టింది. 

పవర్ ప్లే తర్వాత ఒక్కసారిగా రాజస్థాన్ కుప్పకూలింది. జైశ్వాల్ (34) ను మొయిన్ అలీ పెవిలియన్ కు పంపగా.. ఇన్నింగ్స్ 8 ఓవర్లో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసి రాజస్థాన్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ దశలో రాజస్థాన్ ఓటమి ఖామనుకున్నారు. కానీ 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇక పరాజయం ఖామనుకుంటున్న దశలో 13 ఓవర్లో విశ్వరూపమే చూపాడు. మొయిన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 13 ఓవర్లో తొలి బంతికి హెట్ మేయర్ సింగిల్ తీయగా.. ఆ తర్వాత పరాగ్ మిగిలిన 5 బంతులను సిక్సర్లుగా మలిచాడు.

దీంతో ఒక్కసారిగా రాజస్థాన్ విన్నింగ్ రేస్ లోకి వచ్చింది. హెట్ మేయర్ తో కలిసి 92 పరుగులు జోడించి రాజస్థాన్ ను పోటీలో నిలిపాడు. హెట్ మేయర్ ను హర్షిత్ రాణా ఔట్ చేయడంతో మ్యాచ్ మరోసారి ఆసక్తికరంగా మారింది. చివరి వరకు అద్భుత పోరాటం చేసి పరాగ్ ను ఔట్ చేసి మ్యాచ్ ను చేతుల్లోకి తీసుకున్న కేకేఆర్.. చివరి ఓవర్లో శుభం దూబే కంగారు పెట్టాడు. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన దశలో యార్కర్ తో సింగిల్ మాత్రమే ఇచ్చాడు. కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి,హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరాకు ఒక వికెట్ దక్కింది. 

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఈ సీజన్ లో తొలిసారి బ్యాటింగ్ లో రస్సెల్ (25 బంతుల్లో 57: 4 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోయాడు. అతనితో పాటు రఘువంశీ(44), గర్భాజ్(35), రహానే(30) రాణించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. రస్సెల్ (57) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో యుద్ వీర్ సింగ్, తీక్షణ, పరాగ్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.