రెండు నెలల్లో టైమైపోతుంటే.. ఇప్పుడు స్టడీ టూర్లా !: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి

రెండు నెలల్లో టైమైపోతుంటే.. ఇప్పుడు స్టడీ టూర్లా !: ఫోరం ఫర్  గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌‌‌‌ఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసే సమయంలో ఇలాంటి పర్యటనలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికే అని, ఇది ప్రజల్లో తప్పడు సంకేతాన్ని పంపుతుందని మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ డిపార్టుమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్​ పద్మనాభరెడ్డి మంగళవారం లెటర్​రాశారు.

ఈ నెల 29న జరిగిన స్టాండింగ్ కమిటీ మీటింగులో కార్పొరేటర్ల స్టడీ టూర్‌‌‌‌కు నిర్ణయం తీసుకున్నారని, అయితే, జీహెచ్‌‌‌‌ఎంసీ కౌన్సిల్ పదవీ కాలం ఫిబ్రవరి10తో ముగియనుందని, వీరు పర్యటన ముగించుకుని వచ్చేసరికి ..వారి పదవీ కాలం కాస్తా దగ్గర పడుతుందని, దీనివల్ల ప్రజాధనం వృథా తప్పితే ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.

ప్రజల పన్నుల రూపంలో వచ్చే రూ.కోట్ల నిధులను, ఎటువంటి ఉపయోగం లేని విహార యాత్రల కోసం ఖర్చు చేయడం సమంజసం కాదన్నారు. కార్పొరేటర్ల స్టడీ టూర్ ప్రతిపాదనను తక్షణమే తిరస్కరించాలని, అనవసరపు ఖర్చులు చేయొద్దని కోరారు. ఈ విషయమై ఆయన బల్దియా కమిషనర్ కి కూడా ఒక లెటర్​రాశారు.