 
                                    - ప్రశ్నలు అడిగేందుకు 50 మంది ఓటర్లకు చాన్స్
- ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి ప్రకటన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) కీలక ప్రకటన చేసింది. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో నిలిచిన అభ్యర్థులతో వచ్చే నెల 3న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు హాజరుకానున్నట్లు ఎఫ్‌జీజీ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి తెలిపారు. ముఖాముఖిలో నియోజకవర్గం నుంచి 50 మంది ఓటర్లు పాల్గొని, ప్రశ్నలను అడగనున్నారని వివరించారు. ‘
‘అసలు మీకు ఓటు ఎందుకు వేయాలి? వేస్తే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఎలా?’’ వంటి ప్రశ్నలకు అభ్యర్థులు జవాబులు ఇవ్వనున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎఫ్‌జీజీ గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఓటర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించింది.
ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ..‘‘జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెంచడానికి, ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించాం. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటాకైనా ఓటు వేయాలి. ఓటింగ్ లో కచ్చితంగా పాల్గొనాలి’’ అని పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్‌లు నాగిరెడ్డి, చంద్రవదన్, ఎంవీ రెడ్డి, ఎఫ్‌జీజీ వైస్ ప్రెసిడెంట్ గోపాల్‌రెడ్డి, కార్యదర్శి సోమ శ్రీనివాస్ రెడ్డి, వివేక్, భాస్కర రెడ్డి, సి. విజయకుమార్ రెడ్డి, జి.శ్యామ్ ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
         
                     
                     
                    