- ఈ ఏడాది నుంచే అడ్మిషన్స్
- 30 మంది స్టూడెంట్స్‌తో మొదటి బ్యాచ్ ప్రారంభం
- నేడు కళాశాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి తుమ్మల
భద్రాద్రికొత్తగూడెం/ అశ్వారావుపేట, వెలుగు: హార్టికల్చర్ హబ్‌గా పేరొందిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటకు ప్రభుత్వం హార్టికల్చర్ కాలేజీని సాంక్షన్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 4 కాలేజీలు ఉండగా, ఇది 5వ హార్టికల్చర్ కాలేజీ. కాలేజీకి అగ్రికల్చర్ మినిష్టర్ తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేయనున్నారు. అడ్మిషన్లు ఈ ఏడాది నుంచే ప్రారంభం కానున్నాయి. 30 మంది స్టూడెంట్స్‌తో మొదటి బ్యాచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఈ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు.
హార్టికల్చర్‌కు ఈ ప్రాంతం ప్రసిద్ధి..
రాష్ట్రంలోనే హార్టికల్చర్‌కు అశ్వారావుపేట ప్రసిద్ధి చెందింది. నియోజకవర్గంలో అరుదైన పంటలు, పలు రకాల పండ్లు, కూరగాయలు, పూలతో పాటు ఆయిల్‌పాం, కొబ్బరి, కోకో, వక్క, లవంగం, డ్రాగన్ ఫ్రూట్, దాల్చిన చెక్క వంటి పంటలు సాగవుతున్నాయి. మెడిసిన్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా వేలాది ఎకరాల్లో నర్సరీలున్నాయి. హార్టికల్చర్ స్టూడెంట్స్‌కు రీసెర్చ్ కోసం ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు. క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసేందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉండడం కాలేజీ ఏర్పాటుకు కలిసి వచ్చింది.
ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో సీఎం రేవంత్ రెడ్డి హార్టికల్చర్ కాలేజీని సాంక్షన్ చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇప్పటికే అగ్రికల్చర్ కాలేజీ, రీసెర్చ్ సెంటర్, కొబ్బరి విత్తన క్షేత్రంతోపాటు ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు హార్టికల్చర్ కాలేజీ ఏర్పాటు కానుంది. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, వనపర్తి జిల్లాలో మోజర్ల, మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల, సిద్దిపేట జిల్లాలోని ములుగు ప్రాంతంలో ప్రస్తుతానికి హార్టికల్చర్కాలేజీలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని రామగిరి ఖిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో హార్టికల్చర్(అగ్రికల్చర్) పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి.
30 మందితో మొదటి బ్యాచ్..
హార్టికల్చర్ కాలేజీ నిర్మాణాలు పూర్తయ్యే వరకు అశ్వరావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీలో క్లాసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానుండగా, 30 మంది స్టూడెంట్స్‌తో మొదటి బ్యాచ్‌ను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ
కొనసాగనుంది.
‘తుమ్మల’ చొరవతోనే..
ఈ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో అశ్వారావుపేటకు హార్టికల్చర్ కాలేజీ మంజూరైంది. హార్టికల్చర్ కాలేజీ విషయమైన మంత్రి పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హార్టికల్చర్ కాలేజీ ఆవశ్యకతను గుర్తించిన సీఎం కాలేజీని శాంక్షన్ చేశారని మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నేడు హార్టికల్చర్ కాలేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రోగ్రాంలో మంత్రి తుమ్మలతో పాటు డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ షేక్ యాస్మిన్ భాష, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కె. సురేంద్రమోహన్, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దండా రాజిరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.
నేడు మంత్రి తుమ్మల రాక
ఏళ్లుగా ఎదురుచూస్తున్న హార్టికల్చర్ కళాశాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. బుధవారం అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ గురువారం మంత్రి తుమ్మల కాలేజ్‌ను ప్రారంభించనున్నారని చెప్పారు. అదేవిధంగా రూ.3 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులను మంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ 10 జిల్లాల నుంచి 2 వేల మంది రైతులు వస్తారని, ఆయిల్ ఫామ్ తోటలను విజిట్ చేసి సాయంత్రానికి అశ్వారావుపేట కార్యక్రమానికి హాజరవుతారన్నారు.
