దేవుళ్ల పేరుతో బెదిరించి బలవంతపు వసూళ్లు.. శామీర్ పేటలో నలుగురు అరెస్ట్

దేవుళ్ల పేరుతో బెదిరించి బలవంతపు వసూళ్లు.. శామీర్ పేటలో  నలుగురు అరెస్ట్

శామీర్ పేట, వెలుగు: దేవుళ్ల పేరుతో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న నలుగురిని శామీర్ పేట పోలీసులు అరెస్ట్​చేశారు. సీఐ శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ కు చెందిన నాగరాజు, శ్రీనాథ్, లక్ష్మణ్, రాజు మంగళవారం చంద్రారెడ్డి కాలనీలోని శివసాయి నారాయణ ఇంట్లోకి ప్రవేశించారు. ఆయన చేతికి దేవుని దారం కట్టి, పేరు అడిగి నోట్​బుక్​లో రాశారు. తూంకుంట వద్ద దుర్గామాత విగ్రహాన్ని పెడుతున్నాం.. రూ.20 వేల చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన దగ్గర లేవని చెప్పగా.. తాము నీకు దారం కట్టాం.. తప్పనిసరిగా ఇవ్వాలి.. లేకపోతే వదలం అని బెదిరించి, ఫోన్ పే ద్వారా రూ.500 తీసుకున్నారు. మరో వ్యక్తి వద్ద రూ.2 వేలు డిమాండ్ చేశారు. గతంలోనూ దేవుళ్ల పేరుతో కొంతమందిని ఇలాగే బెదిరించారు. 

అయితే వాళ్లు ఎటువంటి విగ్రహం పెట్టడం లేదని తెలుసుకున్న బాధితుడు శివసాయి నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదైంది. పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్​చేసి, 4 ఫోన్లు, 2 బైక్‌‌‌‌లు స్వాధీనం చేసుకున్నారు. దేవుళ్ల పేరుతో ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని సీఐ శ్రీనాథ్ సూచించారు. ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.