
బ్యాంకాక్: అండర్–22 ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా బాక్సర్ల పంచ్ అదురుతోంది. బుధవారం వివిధ కేటగిరీల్లో మరో నలుగురు బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు. మెన్స్ 75 కేజీల సెమీస్‌లో నీరజ్ 5–0తో కియోంగో బ్యాంగ్ (సౌత్ కొరియా)పై గెలిచాడు. బౌట్ ఆరంభం నుంచి హుక్స్, అప్పర్ కట్స్‌తో ఆకట్టుకున్న ఇండియన్ బాక్సర్ ప్రత్యర్థికి ఒక్క చాన్స్ కూడా ఇవ్వలేదు. మూడు రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచాడు. మెన్స్ 90+ కేజీ సెమీస్‌లో ఇషాన్ కటారియా ఆర్‌ఎస్‌సీ ద్వారా చెన్ చెన్ (చైనా)ను చిత్తు చేశాడు. ఇషాన్ విసిరిన బలమైన పంచ్‌ల ధాటికి చెన్ తట్టుకోలేకపోయాడు. మూడో రౌండ్‌లో కిందపడిపోవడంతో రిఫరీ బౌట్‌ను మధ్యలోనే ఆపేశాడు.
విమెన్స్ 57 కేజీల్లో యాత్రి పటేల్ 5–0తో తి నహుంగ్ క్వాండ్ (వియత్నాం)పై నెగ్గింది. లెఫ్ట్, రైట్ పంచ్‌లతో యాత్రి బౌట్ చివరి వరకు దూకుడును కొనసాగించింది. విమెన్స్ 60 కేజీల్లో ప్రియా.. ఓడినాఖోన్ ఇస్మోయిలోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించింది. ఇక రాకీ చౌదరీ.. సామ్ ఎస్టకీ (ఇరాన్) మధ్య జరగాల్సిన బౌట్‌ను నిలిపేశారు. రెండో రౌండ్‌లో రాకీ కను బొమ్మలు కట్ కావడంతో బౌట్‌ను కొనసాగించలేదు. 60 కేజీల సెమీస్ బౌట్‌లో హర్ష్ 1–4తో షోహ్రుహ్ అబ్దుమాలికోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో, 90 కేజీల్లో అంకుష్ 0–5తో సంజార్-అలీ బెగాలియేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడారు. విమెన్స్ 48 కేజీ సెమీస్‌లో భావన శర్మ 1–4తో రోబియాఖోన్ బఖ్తియోరోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం చవిచూసింది. విమెన్స్‌లో పార్థవి గ్రేవాల్ (60 కేజీ), ప్రాంజల్ యాదవ్ (65 కేజీ), శ్రుతి (75 కేజీ) కూడా సెమీస్‌తోనే సరిపెట్టుకున్నారు. వీళ్లకు బ్రాంజ్ మెడల్ ఖాయమైంది.