
ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ను సిద్ధం చేశామన్న ఐసీఎంఆర్, సీరమ్
మూడో ఫేజ్ ట్రయల్స్‌కు 1600 మందిని ఎంపిక చేసినట్టు వెల్లడి
ఫేజ్2/3 ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయన్న ఐసీఎంఆర్
అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ టీకా ‘కొవోవ్యాక్స్’ బల్క్ రెడీ
తొందర్లోనే వయల్స్‌లో నింపుతామన్న సీరమ్ ఇనిస్టిట్యూట్
థర్డ్ ఫేజ్ ట్రయల్స్‌కు అప్లై చేస్తామన్న ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రెడీ అయిపోయింది. 4 కోట్ల డోసులు సిద్ధమయ్యాయి. మిగిలిందల్లా సర్కార్ నుంచి అనుమతి రావడమే. అవును, ఈ విషయాన్ని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించాయి. 4 కోట్ల డోసులను తయారు చేశామని చెప్పాయి. గురువారం వ్యాక్సిన్ అప్డేట్పై ప్రకటన చేశాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా కలిసి అభివృద్ధి చేస్తున్న టీకాపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. మన దగ్గర ‘కొవిషీల్డ్’ పేరుతో ఈ కరోనా టీకాను మార్కెట్ చేయనుంది కంపెనీ. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌తో పాటు అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ కంపెనీతోనూ సీరమ్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆ కంపెనీ తయారు చేసిన టీకా బల్క్ కూడా అందిందని, అతి త్వరలోనే దానిని ప్రాసెస్ చేసి బాటిల్స్ (చిన్న చిన్న వయల్స్)లో మందును నింపుతామని సీరమ్ చెప్పింది. ‘కొవోవ్యాక్స్’ పేరుతో ఆ టీకాను మార్కెట్ చేస్తోంది. ఆ రెండు టీకాల ట్రయల్స్, అభివృద్ధికి ఐసీఎంఆర్ సహకారం అందిస్తోంది.
కొవిషీల్డ్ ‘లేట్’ ట్రయల్స్‌కు రెడీ
కొవిషీల్డ్ లేట్ ఫేజ్/ఫేజ్3 క్లినికల్ ట్రయల్స్‌కు వలంటీర్ల ఎంపికను పూర్తి చేశామని ఐసీఎంఆర్, సీరమ్ వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలోని 15 ప్రాంతాల్లో ఫేజ్2/3 ట్రయల్స్ చేస్తున్నామని ఐసీఎంఆర్ చెప్పింది. అయితే ఫేజ్3 కోసం అక్టోబర్ 31న 1,600 మంది వలంటీర్లను ఎంపిక చేసి ఫైనల్ చేశామని వెల్లడించింది. ప్రస్తుతం చేస్తున్న ట్రయల్స్‌లో కొవిషీల్డ్ మంచి ఫలితాలనిస్తోందని చెప్పింది. కరోనాకు మంచి పరిష్కారం అతి తొందర్లోనే వస్తుందని పేర్కొంది. దేశంలో అడ్వాన్స్డ్ దశలో ఉన్న వ్యాక్సిన్ కొవిషీల్డ్ మాత్రమేనని చెప్పింది. ముందుగా దేశంలో టీకాను సరఫరా చేసేందుకు 4 కోట్ల డోసులను సీరమ్ తయారు చేసి పెట్టిందని వివరించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇచ్చిన రిస్క్మాన్యుఫాక్చరింగ్ అండ్ స్టాక్‌పైలింగ్ లైసెన్స్ కింద టీకా డోసులను కంపెనీ తయారు చేసిందని తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్, బ్రెజిల్, సౌతాఫ్రికా, అమెరికాల్లో థర్డ్ ఫేజ్ ట్రయల్స్ నడుస్తున్నాయని, మన దేశంలో తొందర్లోనే మొదలుపెడతామని ఐసీఎంఆర్ ప్రకటించింది.
త్వరలోనే కొవోవ్యాక్స్ ట్రయల్స్ కూడా
కరోనా లాంటి ఆపదలను ఎదుర్కొనేందుకు ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రభుత్వం పనిచేయడం (పీపీపీ) ఎంతో ముఖ్యమని, అమెరికా కంపెనీ నోవావ్యాక్స్, బ్రిటన్ ఆస్ట్రాజెనికాలతో చేసుకున్న ఒప్పందాలు అందుకు ఉదాహరణలని ఐసీఎంఆర్ చెప్పింది. దేశంలో కొవోవ్యాక్స్ఫేజ్3 ట్రయల్స్‌కు సంబంధించి త్వరలోనే డీసీజీఐకి దరఖాస్తు చేస్తామంది. అనుమతి వచ్చిన వెంటనే ట్రయల్స్‌కు వలంటీర్ల ఎంపికను ప్రారంభిస్తామని పేర్కొంది. ఇప్పటికే కొవోవ్యాక్స్ బల్క్ వచ్చేసిందని సీరమ్ కూడా ప్రకటించింది.
టీకాల్లో ఇండియానే పెద్దన్న: సీరమ్
కరోనాపై పోరులో ఐసీఎంఆర్ది చాలా ముఖ్యమైన పాత్ర అని సీరమ్ సీఈవో అధర్ పూనావాలా కొనియాడారు. అలాంటి అత్యున్నత సంస్థతో కలిసి పనిచేయడం ద్వారా టీకాల అభివృద్ధిలో దేశాన్ని పెద్దన్న స్థానంలో నిలబెట్టొచ్చని అన్నారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ మౌలిక వసతులను మరింతగా డెవలప్ చేసేందుకు కరోనా మహమ్మారి రూపంలో ఓ మంచి అవకాశం వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కూడా చాలా అవసరమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా టీకాల తయారీలో ఇండియాది కీలక పాత్ర అని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ అన్నారు. అధునాతన టెక్నాలజీ, మెరుగైన తయారీ యంత్రాలతో ప్రపంచంలోనే టీకాల అభివృద్ధిలో సీరమ్ ఓ టాప్ సంస్థ అని నిరూపించుకుందన్నారు. కొవిషీల్డ్, కొవోవ్యాక్స్ రెగ్యులేటరీ అప్రూవల్స్ కోసం రెండు సంస్థల సైంటిస్టులు కృషి చేస్తున్నారని, క్వాలిటీలో ఎక్కడా రాజీ లేకుండా రెగ్యులేటరీ ప్రమాణాలకు తగ్గట్టే టీకాలు తయారవుతున్నాయని చెప్పారు.
For More News..