దీక్ష ఫలించింది.. ప్రేమ గెలిచింది!

దీక్ష ఫలించింది.. ప్రేమ గెలిచింది!

వర్ధన్నపేట, వెలుగు: తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన యువతి పోరాటం ఫలించింది. శ్రీకాంత్‌‌‌‌తో తనకు వివాహం జరిపించాలని కోరుతూ శ్రీదేవి గత నాలుగు రోజులుగా వర్ధన్నపేట మున్సిపల్  చైర్​పర్సన్  పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట దీక్ష చేపట్టింది.

ఈక్రమంలో సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కేఆర్  నాగరాజు చొరవ తీసుకున్నారు. శ్రీకాంత్, అతని కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడంతో పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. దీంతో నాలుగు రోజులుగా కొనసాగిన శ్రీదేవి దీక్షకు తెరపడింది. ఈ వివాహంతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. దళిత సంఘాల ప్రతినిధులు, మహిళలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.