వరుసగా నాలుగు రోజుల ర్యాలీ .. రూ. 8.48 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపాదన

వరుసగా నాలుగు రోజుల ర్యాలీ .. రూ. 8.48 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపాదన

న్యూఢిల్లీ: వరుసగా నాలుగు రోజుల మార్కెట్ ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ. 8.48 లక్షల కోట్లు పెరిగింది. గ్లోబల్​ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో బీఎస్​ఈ సెన్సెక్స్​ దాదాపు 2 శాతం పెరిగింది.  ఈ సూచీ బుధవారం 114.49 పాయింట్లు పెరిగి 73,852.94 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 383.16 పాయింట్లు ఎగిసి 74,121.61 వద్దకు చేరుకుంది. గత నాలుగు రోజుల్లో బీఎస్​ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ 1,363.95 పాయింట్లు పెరిగింది. 

బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ -లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నాలుగు రోజుల్లో రూ.8,48,328.9 కోట్లు పెరిగి రూ.4,01,37,377.21 కోట్లకు (4.84 ట్రిలియన్ డాలర్లు) చేరింది.  నెలవారీ ఎఫ్​అండ్​ఓ గడువు ముగియనుండటం, సానుకూల ప్రపంచ సంకేతాల మధ్య  పెట్టుబడిదారులు తమ పొజిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కవర్ చేయడంతో మార్కెట్లు ఊపందుకుంటున్నాయి. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల గురించి ఇప్పటికీ చాలా అనిశ్చితి ఉంది. ఘర్షణలు కొంచెం పెరిగినా ముడి చమురు ధరల పెరుగుదల ఉంటుందనే భయాలు నెలకొన్నాయి. 

 బుధవారం సెన్సెక్స్ బాస్కెట్ నుంచి, జేఎస్​డబ్ల్యూ  స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్​టీపీసీ, బజాజ్ ఫైనాన్స్,  యాక్సిస్ బ్యాంక్ లాభపడ్డాయి. టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మారుతీ, రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టైటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వెనుకబడి ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై,  హాంకాంగ్ లాభాలు సంపాదించుకున్నాయి. యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ మంగళవారం లాభాలతో ముగిసింది.