మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో .. నలుగురు మృతి

మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో .. నలుగురు మృతి
  •  అర్ధరాత్రి నిద్రిస్తుండగా మీదపడిన ఇంటి పైకప్పు
  • భార్య, ముగ్గురు చిన్నారులు మృతి.. భర్తకు గాయాలు
  • నాగర్ కర్నూల్ జిల్లా వనపట్లలో విషాదం
  • మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రాజేశ్‌ రెడ్డి దిగ్భ్రాంతి 
  • బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
  • బాధితులకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తం: కలెక్టర్

నాగర్ కర్నూల్ ​టౌన్, వెలుగు: మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. సోమవారం నాగర్‌‌కర్నూల్‌ జిల్లా వనపట్ల గ్రామంలో ఈ విషాదకర ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్‌‌కు భార్య పద్మ (28), కూతుళ్లు తేజస్విని(6), వసంత (7), కొడుకు విక్కీ(15 నెలలు) ఉన్నారు. ఆటో నడుపుకుంటూ భాస్కర్​ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

 ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ ఇంటి ముందున్న రేకుల షెడ్డులో పడుకున్నారు. దోమలు కుడుతుండడంతో భాస్కర్.. తన భార్య, పిల్లలతో కలిసి ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు బాలస్వామి, చిట్టెమ్మ బయటే నిద్రపోయారు. శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షానికి ఇంటి మట్టి మిద్దె బాగా తడిసిపోయింది. 

 దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి పైకప్పు ఒక్కసారిగా ఇంట్లో నిద్రిస్తున్న భాస్కర్‌‌‌‌, ఆయన భార్య, పిల్లలపై పడింది. ఈ ప్రమాదంలో భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు, కొడుకు మట్టి కింద కూరుకుపోయి, అక్కడికక్కడే చనిపోయారు. భాస్కర్ తీవ్రంగా గాయపడగా, నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందరడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

 పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. హాస్పిటల్‌‌లో భాస్కర్‌‌‌‌ను పరామర్శించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్.. అతనికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట హాస్పిటల్‌‌ సూపరింటెండెంట్ రఘు, ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ చంద్రశేఖర్ ఉన్నారు. 

మంత్రి జూప‌‌ల్లి దిగ్భ్రాంతి..

వనపట్లలో మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘ‌‌ట‌‌న‌‌పై ఎక్సైజ్, ప‌‌ర్యాట‌‌క‌‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌‌ల్లి కృష్ణారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి మిద్దె తడిసి, ఇల్లు కుప్పకూలిందని అధికారులు మంత్రికి వివ‌‌రించారు. మృతుల కుటుంబానికి సానుభూతి తెలిపిన మంత్రి.. వారికి ప్రభుత్వం అండ‌‌గా ఉంటుంద‌‌ని చెప్పారు. తీవ్రంగా గాయ‌‌ప‌‌డిన భాస్కర్‌‌‌‌కు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. 

విషయం తెలుసుకున్న నాగర్‌‌‌‌కర్నూల్‌‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి వెంటనే హైదరాబాద్‌‌ నుంచి హుటాహుటిన జిల్లా కేంద్రంలోని హాస్పిటల్‌‌కు చేరుకొని బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి, మాట్లాడారు. భాస్కర్‌‌‌‌కు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. నియోజకవర్గంలోని తిమ్మాజీపేట, తాడూరు ఘటనలు మరవక ముందే వనపట్లలో మిద్దెకూలి నలుగురు చనిపోవడం దురదృష్టమన్నారు. 

మృతుల కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి, అక్కడ ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మృతుల దహన సంస్కారానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. అక్కడ నుంచి వనపట్లకు వెళ్లి కూలిన ఇంటిని పరిశీలించారు.