
- నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలకు దక్కిన అవకాశం
- కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ధన్- ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకంలో తెలంగాణలోని నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలను చేర్చింది. ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి ఈ పథకంలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. అనంతరం కొన్ని రోజులకే తెలంగాణలోని నాలుగు జిల్లాలకు కేంద్రం ఈ స్కీమ్లో చోటు కల్పించింది.
ఈ పథకం ఉత్పాదకత పెంపు, పంటల మార్పిడి, నీటిపారుదల, నిల్వ, ఉత్పత్తుల విలువ పెంచే ప్రాసెసింగ్‌లకు ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ రంగంలో చారిత్రక మార్పులు తెస్తుందని మంత్రి తెలిపారు. ఎంపికైన నాలుగు జిల్లాలకు రూ.960 కోట్ల వ్యయంతో ఆరేండ్ల పాటు ఈ పథకం అమలవుతుందని చెప్పారు. 36 కేంద్ర పథకాలతో సమన్వయం, రాష్ట్ర పథకాలతో అనుసంధానం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో తక్కువ ఉత్పాదకత జిల్లాల రైతులకు విస్తృత లాభాలు చేకూరుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలను ఈ పథకంలో చేర్చడంతో రైతుల సంక్షేమంతో పాటు ఆహార భద్రత, ఉపాధి అవకాశాలు పెంచేందుకు దోహదపడుతుందని మంత్రి వివరించారు. రాష్ట్ర పథకాలతో దీన్ని అనుసంధానం చేస్తూ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అగ్రికల్చర్ వర్సిటీల సహకారంతో పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు.