
ఇబ్రహీం పట్నం, వెలుగు: సిటీలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సాగర్ హైవేపై బైక్ను కారు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, అతని భార్య, కూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లికి చెందిన మైలారపు జంగయ్య(36) తన భార్య పార్వతమ్మ, కూతురు అశ్వితతో కలిసి సోమవారం ఉదయం బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరారు.
మంచాల పరిధిలోని గురునానక్ కాలేజీ సమీపంలో వీరిని వెనుక నుంచి కారు ఢీకొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య, కూతురు గాయపడినట్లు ఎస్ఐ లాలయ్య తెలిపారు.
మరో బైక్ను ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి..
గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో ముందు వెళ్తున్న బైక్ను ఢీకొని సాఫ్ట్వేర్ఉద్యోగి మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా కొర్వి మండలం పెద్దగూడ తండాకు చెందిన గుగులోత్ గోవింద్ (29) గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగం చేస్తూ టెలికాం నగర్ కాలనీలో ఉంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి గోవింద్ తన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌మీద టెలికాం నగర్ నుంచి మాదాపూర్ వైపు బయలుదేరాడు. మార్గమధ్యలో శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ కింద తన ముందు వెళ్తున్న హీరో ఫ్యాషన్ బైక్ను అదుపుతప్పి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గోవింద్ తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫ్యాషన్ వాహనం మీద వినోద్ తన భార్య జ్యోతితో కలిసి గౌలిదొడ్డి నుంచి కూకట్ పల్లికి వెళ్తున్నాడు. ఈ ప్రమాదంలో వినోద్ కు సైతం తీవ్ర గాయాలు కాగా, వెనుక కూర్చున్న అతని భార్య ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది.
భార్యను తీసుకురావడానికి వెళ్తూ..
హైదరాబాద్‌సిటీ: పుట్టింటి వద్ద ఉన్న భార్యను తీసుకురావడానికి వెళ్తూ భర్త చనిపోయాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్మండలం బాయిమీది తండాకు చెందిన పవార్ జైసింగ్(22)కు పాషపూర్తండాకు చెందిన అనితతో పెండ్లి జరిగింది. అయితే, పుట్టింట్లో గుడి పూజ ఉండడంతో గత నెల 27న అనిత అక్కడి వెళ్లింది. ఆమెను తీసుకురావడానికి ఆదివారం పాషపూర్తండాకు జైసింగ్ బైక్పైబయలుదేరాడు. మార్గమధ్యలో అడికిచర్ల దాటిన తరువాత ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు.
గండిపేట: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నార్సింగిలో ఒకరు చనిపోయారు. నార్సింగికి చెందిన శ్రీనివాస్ ఆదివారం రాత్రి వివేకానందనగర్ కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో శ్రీనివాస్ మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి డెడ్‌బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఆటోను ఢీకొట్టిన లారీ
కీసర: ఆటోను లారీ ఢీకొనడంతో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. కలెక్టర్ ఆఫీస్‌లో సోమవారం మహిళా గ్రూప్ సమావేశం ఉండగా, కీసర నుంచి పలువురు మహిళలు ఆటోలో బయలుదేరారు. తిమ్మాయిపల్లి సమీపంలో వీరిని ఆటోను లారీ ఢీకొనడంతో అందులోని వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వీరిని పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు.