
గుజరాత్‌లోని గిర్ అడవిలో బావిలో పడిపోయిన నాలుగు సింహాలను అధికారులు కాపాడారు. గిర్ తూర్పు ఫారెస్టు డివిజన్‌లోని సరసియా రేంజ్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. సరసియా రేంజ్ పరిధిలోని మనవావ్ గ్రామంలో ఉన్న ఓ పంటపొలంలో 30 మీటర్ల లోతు బావి ఉంది. ప్రస్తుతం దాన్ని వాడట్లేదు. పూర్తిగా ఎండిపోయింది. శనివారం సాయంత్రం టైంలో అటుగా వెళ్తున్న మూడు మగ సింహాలు, ఒక ఆడ సింహం ఆ బావిలో పడ్డాయి.
విషయం గమనించిన పొలం యజమాని ససరియా రేంజ్ ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చారు. రాత్రంతా కష్టపడి ఆ నాలుగు సింహాలను వాళ్లు బయటకు తీశారు. గ్రామస్థులు, తమ దగ్గరున్న పరికరాలతో సింహాలను కాపాడారు. సింహాలు, ఇతర జంతువులు తెరిచి ఉన్న బావుల్లో పడకుండా సుమారు 37,201 పిట్టగోడలు ఏర్పాటు చేశామని గత నెలలోనే గుజరాత్ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇంతలోనే ఈ సంఘటన జరిగింది. అడవిలో ఇలాంటి ఓపెన్ బావులు సుమారు 50 వేల వరకు ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.