- కేజ్రీవాల్, సిసోడియా, కవితకు క్లీన్ చిట్ పై హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ
- పిటిషన్ పై విచారించనున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా 23 మందికి రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ జితేంద్ర సింగ్ క్లీన్ చిట్ ఇస్తూ గత నెల 27న తీర్పు చెప్పారు. సీబీఐ దర్యాప్తులో అనేక లొసుగులున్నాయని, వందలాది పేజీలతో ఛార్జ్ షీట్ తయారుచేసినా ఒక్క సాక్షి ప్రకటనను కూడా ఖచ్చితంగా చేర్చలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్(ఐఓ)పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఈ నెల 1న ఢిల్లీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది. దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా తీర్పు ఉందని పేర్కొంది. కేజ్రీవాల్, సిసోడియా, కవిత పాత్రను అంచనా వేయడంలో స్పెషల్ కోర్టు పొరబడిందని తెలిపింది. మద్యం పాలసీ వెనుక ఉన్న భారీ కుట్రను చూడకుండా, విడివిడి అంశాలుగా పరిగణించడం వల్ల కేసు నీరుగారిందని ఆరోపించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో అభ్యర్థించింది. కాగా ఈ పిటిషన్ పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నేడు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
