వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వేస్టేషన్లో కూలీల ముసుగులో నలుగురు మావోయిస్టులు !

 వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వేస్టేషన్లో కూలీల ముసుగులో నలుగురు మావోయిస్టులు !
  • పది రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా రుక్మాపూర్ రైల్వే స్టేషన్లో పనులు
  • మహారాష్ట్ర, తాండూరు పోలీసుల ఉమ్మడి ఆపరేషన్
  • పక్కా సమాచారంతో మెరుపు దాడి, నలుగురి అరెస్ట్

తాండూరు, వెలుగు: కూలీల ముసుగులో మావోయిస్టులు వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వేస్టేషన్​లో గుట్టు చప్పుడు కాకుండా పని చేస్తున్నారు. పక్కా సమాచారంతో వీరిని పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్​ చేశారు.

మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు పురుషులతోపాటు ఒక మహిళ నక్సలైట్ కొంతకాలంగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రుక్మాపూర్ రైల్వే స్టేషన్‌‌లో కూలీ పనులకు దిరారు. పది రోజులుగా ఎవరికీ అనుమానం రాకుండా పనులు చేసుకుంటూ తలదాచుకుంటున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా పోలీసులు, తాండూరు డీఎస్పీ నర్సింగ్​యాదయ్య ఆధ్వర్యంలో రుక్మాపూర్ రైల్వే హెడ్ క్వార్టర్స్‌‌లో మెరుపు దాడులు నిర్వహించారు. ఆ నలుగురు తేరుకునే లోపే పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం మావోయిస్టులను మహారాష్ట్రకు తరలించారు. తాండూరు ప్రాంతంలో వీరికి ఎవరైనా ఆశ్రయం కల్పించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.